బలపరీక్షకు ముందే కుప్పకూలిన ఉద్ధవ్ సర్కార్

శివసేన నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్యెల్యేలు తిరుగుబాటు చేయడంతో గత పది రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం చివరకు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పదవికి రాజీనామా చేయడంతో ముగిసింది. ఉద్ధవ్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన్నట్లు ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం రాత్రి తెలపడంతో, వెంటనే సభలో బలపరీక్షకు సిద్ధం కమ్మనమని గవర్నర్   భగత్ సింగ్ కోషియారీ ఆదేశించారు. 
 
గవర్నర్ ఆదేశంను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు థాకరే వర్గం వెళ్లగా, బుధవారం సాయంత్రం సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం గవర్నర్ ఆదేశం విషయంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. బలపరీక్ష జరగాల్సిందే అని స్పష్టం చేసింది. దానితో ముఖ్యమంత్రి పదవికి బుధవారం రాత్రి పొద్దుపోయాక రాజీనామా ప్రకటించిన థాకరే, ఆ తర్వాత గవర్నర్ ను కలిసి రాజీనామాను సమర్పించారు. 
 
ఒకవైపు అసెంబ్లీలో బల పరీక్షకు రంగం సిద్ధం అవుతుండగా మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే బుధవారం కేబినెట్ మీటింగ్ నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఔరంగాబాద్ పేరును మార్చాలని ఎప్పటి నుంచో శివసేన చేస్తున్న డిమాండ్ మేరకు ఆ సిటీ పేరును శంభాజీ నగర్ గా మార్చారు. 
 
అలాగే ఉస్మానాబాద్ సిటీని ధారాశివ్ గా మార్చారు. అలాగే నిర్మాణంలో ఉన్న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా పేరు పెట్టారు. అయితే, పుణే సిటీకి ఛత్రపతి శివాజీ తల్లి జీజాబాయి పేరిట జీజా నగర్ గా, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ కు మాజీ సీఎం ఏఆర్ అంతులే పేరును పెట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్ ను కేబినెట్ తోసిపుచ్చింది. 
 
కాగా, రెండున్నరేండ్లుగా సహకరించిన కేబినెట్ సహచరులందరికీ ఈ సందర్భంగా ఉద్ధవ్ ధన్యవాదాలు చెప్పారని కాంగ్రెస్ మంత్రి సునీల్ కేదార్ మీడియాకు తెలిపారు. ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని కూడా కోరారని వెల్లడించారు.  
 
 సుప్రీంలో తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఉద్ధవ్ థాక్రే ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్ ప్రకటించారు. తన తండ్రి బాల్ థాక్రే ఆకాంక్ష మేరకు ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మార్చడం తృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. 
 
‘‘నేను భయపడే వ్యక్తిని కాను. వీధుల్లో శివసైనికుల రక్తం చిందడం ఇష్టంలేకనే రాజీనామా చేస్తున్నా. మేం ప్రోత్సహించి, పెద్ద స్థానంలోకి తీసుకొచ్చిన వాళ్లే మమ్మల్ని మోసం చేశారు. నేను అనుకోకుండా సీఎం పదవిని చేపట్టాను. అలాగే పదవి నుంచి దిగిపోతున్నా” అని ఉద్ధవ్ భావోద్వేగంతో చెప్పారు.
 
 తనకు నెంబర్ గేమ్ లు ఆడటంలో ఆసక్తి లేదని పేర్కొంటూ తిరుగుబాటు ఎమ్యెల్యేలను తిరిగి వచ్చి సంబరాలు చేసుకోనీయమని, శివసైనికులు వీధులలోకి వచ్చి ఎటువంటి నిరసనలు తెలుపవద్దని ఆయన పిలుపిచ్చారు.  
 
బిజెపి ప్రభుత్వం ఏర్పాటు!
 
ఇక, మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా  మళ్లీ బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్ధవ్ థాక్రే రాజీనామాతో రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డంకులు తొలగిపోతాయి. ఫడ్నవీస్ మళ్లీ సీఎం పదవి చేపడతారని, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 
 
ఇక థాక్రే రాజీనామా ప్రకటన తర్వాత ఫడ్నవీస్ తో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  చంద్రకాంత్ పాటిల్, ఇతర నేతలు ముంబైలోని తాజ్ హోటల్ లో శాసనసభా సమావేశంకు సిద్ధమయ్యారు. తాజ్ హోటల్ వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
 
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా, ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంవీఏ కూటమిలోని శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో సేన నుంచి 39 మంది బీజేపీతో జట్టుకట్టనున్నారు. 
 
ఇండిపెండెంట్లతో కలిపి తమ వర్గంలో 50 మంది ఉన్నట్లు షిండే చెప్తున్నారు. దీంతో బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్ (144) కంటే 12 ఎక్కువగా 156కు పెరిగే అవకాశాలు ఉన్నాయి.