తెలంగాణ లో మాస్క్ తప్పనిసరి

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఇక నుంచి ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తప్పక మాస్కు ధరించాలని సూచించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు 500కు చేరువలో ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో,  భాగ్యనగర పరిసర ప్రాంతాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాజమాన్యాలు కూడా పాఠశాలల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

కాగా, దేశంలో కరోనా నాలుగో వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పుంజుకున్నాయి.  కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం కోత్త కేసులు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 

దేశంలో యాక్టివ్ కేసేలోడ్ కూడా నాలుగు నెలల తర్వాత 1-లక్ష మార్కును అధిగమించి 1,04,555కి చేరుకుంది. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 197.61 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.

24 గంటల్లో దేశంలో కొత్తగా 18,819 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో 39 మంది వైరస్‌ బారినపడి మృతిచెందారు. కాగా, దేశంలో ప్రస్తుతం 1,04,555 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 13,827 మంది కోలుకున్నారు. అయితే, రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.16 శాతానికి పెరిగింది.

తాజాగా నమోదైన కొత్త కేసుల్లో కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి. కేరళలో 4 వేల 459 కొత్త కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 3వేల 957 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య వెయ్యిపైనే నమోదు అయ్యాయి.  ముఖ్యంగా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా ఉండడం ప్రమాద హెచ్చరిక అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు