ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో రూ. 800 కోట్లు మల్లింపు 

ఉద్యోగుల జిపిఎఫ్‌ ఖాతాల్లోని సొమ్ము వారికి తెలియకుండానే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. 1.7.2018 తరువాత బకాయి ఉన్న పెండింగ్‌ డిఏల్లో ఒక డిఏ బకాయిని రాష్ట్ర ప్రభుత్వం ఐదు విడతలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా ఆ మొత్తాన్ని ఒకేసారి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 
 
జిపిఎఫ్‌ స్లిప్పులను కొందరు మంగళవారం డౌన్‌లోడ్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకం రేగింది. పలు సంఘాలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి.  రాష్ట్రంలో ఉన్న 4.20 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ చర్య ద్వారా బాధితులగా మారారని, ఇలా అనుమతి లేకుండా విత్‌ డ్రా చేసిన మొత్తం రూ.800 కోట్ల పైనే ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఖాతాల్లో సొమ్ము మాయం కావడంపై పోలీసు కేసులు పెట్టడానికీ సంఘాలు సిద్ధమవుతున్నాయి. 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్‌ ఖాతాల్లోని సొమ్మును వారికి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, ఇటువంటివి సహించేది లేదని హెచ్చరించింది. ఈ వ్యవహరంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవాబు చెప్పాల్సిందేనని, ఆయనకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
కొత్త వేతన సవరణ ఉత్తర్వులకు సంబంధించి గెజిటెడ్‌ ఆఫీసర్ల జెఎసి ఛైర్మన్‌ కెవి కృష్ణయ్య గతంలో దాఖలు చేసిన పిల్‌ చీఫ్‌ జస్టిస్‌ పీకే మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం ముందు బుధవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషన్‌ తరపు న్యాయవాది పి. రవితేజ జిపిఎఫ్‌ నిధుల మళ్లింపు విషయాన్ని ప్రస్తావించారు.
ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతంలో కూడా ఒక్క రూపాయి తగ్గడానికి వీల్లేదని, ఏ ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయకూడదని దీనికి విరుద్ధంగా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఫిబ్రవరిలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తుచేశారు. ఉద్యోగులకు తెలియకుండానే ఎలాంటి సమాచారం కూడా లేకుండా జిపిఎఫ్‌ ఖాతాల నుంచి నగదును ప్రభుత్వం ఉపసంహరించిందని చెప్పారు.
 
గతేడాది మార్చిలోనూ ఇలాగే ఒక విడత సొమ్మును ప్రభుత్వం మళ్ళించింది. తాజాగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉద్యోగులకు తెలియ కుండానే వారి ఖాతాల నుండి ప్రభుత్వం సొమ్మును వెనక్కి తీసుకుంది. ఇపిఎఫ్‌పై లోను ఇవ్వాలని ఉద్యోగులు ఎప్పటి నుండో దరఖాస్తులు చేసుకుం టున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.
ప్రభుత్వమే దోపిడీకి పాల్పడింది … బీజేపీ
ప్రభుత్వం డే పట్టపగలు దోపిడీకి పాల్పడిందని బీజేపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదరశి పివిఎన్  మాధవ్  విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల జిపిఎస్ ఖాతాల నుంచి డబ్బులు దొంగలించిందని పేర్కొంటూ గత నవంబర్‌లో కూడా ఇదే విధంగా డబ్బులు మాయమయ్యాయనిగుర్తు చేశారు. చర్యలు తీసుకోవాల్సిన వారే చోరీకి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. 
 
కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుకు మార్చి నెలలో రూ.59,038 విత్‌డ్రా చేసినట్లు తాజాగా రశీదు వచ్చింది. పిహెచ్‌సిలో పనిచేసేమెడికల్‌ అఫీసర్‌కు రూ.88,726, మరో అధికారికి ఫిబ్రవరిలో రూ.1,34,000, మార్చిలో రూ.64,907 వారికి తెలియకుండానే విత్‌ డ్రా అయ్యింది. సిఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరి ఆర్థిక లావాదేవీలను ప్రభుత్వం నియంత్రిస్తోంది
 
తమ అనుమతి లేకుండా డీఏ సోమ్ము  మార్చ్లో డెబిట్, క్రెడిట్ ఎంట్రీ కాలేదని  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె అర్ సూర్యనారాయణ తెలిపారు. అంతకు ఏడాది ముందు నుండి పడ్డ సొమ్ము మార్చ్‌లో తీసేశారని చెప్పారు. ఇది క్రిమినల్ చర్య తీసుకోవాల్సిన అంశం అని అధికారులకు చెప్పామని పేర్కొన్నారు. 
 
ఇది తమ అకౌంట్‌ను అనధికారికంగా హ్యాకింగ్ చేయడమే అని చెప్పామని వెల్లడించారు. ఇలా చేస్తే వ్యవస్థలు ఉద్యోగి నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం వుందని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ కార్యాలయం వద్దకు వెళ్ళి మొత్తం వ్యవహరంపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబందించి ఆర్దికశాఖ, సిఎఫ్‌ఎంఎస్‌ అధికారులపై సిబిసిఐడి చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.