దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిపై నియంత్రణ ఎత్తివేత

దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిపై నియంత్రణ ఎత్తివేస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురును ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ రంగ సంస్థలకే విక్రయించాలన్న నిబంధనను ఎత్తివేసింది.
చమురును అన్వేషించి ఉత్పత్తి చేసిన కంపెనీలు దేశీయంగా ఎక్కడైనా క్రూడ్ అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రాయల్టీ, సెస్ ఏకరీతిన కొనసాగుతుంది. క్రూడాయిల్ ఉత్పత్తిపై నియంత్రణను ఎత్తివేయడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయి.
అప్ స్ట్రీమ్ ఆయిల్, గ్యాస్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దేశీయ అవసరాల్లో 85% దిగుమతులపై ఆధారపడ్డామని, కేవలం 15% మాత్రమే దేశీయంగా ఉత్పత్తి జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రానున్న రోజుల్లో దిగుమతుల భారాన్ని తగ్గించుకుని, దేశీయంగా క్రూడ్ ఉత్పత్తి పెంచుకోవడం, ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఉత్పత్తి, రీసెర్చ్ రంగంలో కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురు ఎగుమతిపై నిషేధం మాత్రం కొనసాగనుంది.