రాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుకు తొలిమెట్టు

రాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుకు తొలిమెట్టుగా మారాయని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కూడా స్పష్టం చేశారు.  పిలవని పేరంటానికి వెళ్లి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని  ఎద్దేవా చేశారు.  
బీజేపీ దళితుడిని రాష్ట్రపతిని చేసిందని, ఇప్పుడు ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేయబోతుందని చెప్పారు.  టిఆర్ఎస్ పార్టీ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తుతూ  ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాకుండా టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేస్తుందని అరవింద్ విమర్శించారు.
 
ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని అయినా చేస్తున్నామని పేర్కొన్న అరవింద్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని ప్రకటించి కెసిఆర్ మోసం చేశాడని మండిపడ్డారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయాయని అరవింద్ మండిపడ్డారు. ఆత్మ గౌరవ భవనాలు ఎక్కడికి పోయాయి? అని ప్రశ్నించారు. 
 
దేశవ్యాప్తంగా హడావుడి చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏమైంది అని అరవింద్  ప్రశ్నించారు. సీఎం కెసిఆర్ బీఆర్ఎస్ ఎక్కడికెళ్ళిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.  50 వేల ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలు ఆపేసిన ఘనత కేసీఆర్ దే అని పేర్కొన్నారు. 
 
ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలో చెలగాటం ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం పని చేసే వాళ్లనే బీజేపీ చేర్చుకుంటుందని చెబుతూ భూ కబ్జాలు, అవినీతికి పాల్పడే వాళ్లకు బీజేపీలో ప్రవేశం ఉండబోదని అరవింద్ స్పష్టం చేశారు. 
 
తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో తప్పితే, దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతాల్లోనూ విద్యుత్ ఉందని అరవింద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి కేటాయించి ఉంటే ఇప్పటికే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి అయ్యేదని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమి కేటాయించలేక పోయిన వీళ్లు, విభజన హామీల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అరవింద్ విమర్శించారు.
 
 ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి వస్తే పర్యాటకులా అంటూ అరవింద్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరిగితే ఏ పర్యాటకుడునో సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ మోదీ, అమిత్ షా ను తీసుకువెళ్లి విచారణ చేయలేదా? అని  అరవింద్ ప్రశ్నించారు.