ప్రముఖ వ్యాపార దిగ్గజం, భారతదేశంలోని సంపన్నుల్లో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) నిన్న అర్ధరాత్రి ముంబయిలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ అధికారులు తెలిపారు.
పల్లోంజీ పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకుగాను 2016లో ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. బ్లూమ్‌బెర్గ్ అంచనాల ప్రకారం ఆయన సంపద విలువ రూ.2.2 లక్షల కోట్లు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో 125వ స్థానంలో నిలిచారు. 2021లో ఆయన భారత్‌లోని సంపన్నుల్లో తొమ్మిదో స్థానం దక్కించుకొన్నారు.
మిస్త్రీకి మొత్తం నలుగురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు షాపూర్జీ ప్రస్తుతం గ్రూపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో కుమారుడు సైరస్ మిస్త్రీ గతంలో టాటాసన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. కుమార్తెలు లీలా, ఆలూ ఉన్నారు. వీరిలో ఆలూ ప్రముఖ పారిశ్రామిక వేత్త నోయల్ టాటా భార్య.
1865లో స్థాపించిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కింద మొత్తం 18 కంపెనీలు ఉన్నాయి. 50 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ గ్రూప్ 18.4 శాతం షేర్లతో టాటా సన్స్‌లో అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉంది.
షాపూర్జీ పల్లోంజి గ్రూపు ప్రధానంగా ఇంజినీరింగ్, నిర్మాణం, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసుల్లో సేవలు అందిస్తోంది. ముంబయిలోని ఆర్‌బీఐ భవనం, ది తాజ్‌మహల్ ప్యాలెస్ హౌటల్ నిర్మించింది పల్లోంజీ గ్రూపే. 1970లో పల్లోంజీ మిస్త్రీ ఈ సంస్థను మధ్యప్రాశ్చ్యంలోని అబుదాబీ, ఖతర్, దుబారులో విస్తరించారు.
1971లో ఒమన్ సుల్తాన్ ప్యాలెస్ సహా పలు కీలక భవనాలను ఈ సంస్థ నిర్మించింది. పల్లోంజీ మిస్త్రీ నేతృత్వంలో సంస్థ రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సేవల రంగాల్లో విస్తరించింది. 2004లో ఆయన కుమారుడు షాపూర్ మిస్త్రీకి సంస్థ బాధ్యతలు అప్పజెప్పారు.
ఆయనకు నివాళులు అర్పిస్తూ, బిలియనీర్ పల్లోంజీ మిస్త్రీ మృతి చెందడం తనను బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.”వాణిజ్యం, పారిశ్రామిక రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు” అని మోదీ పేర్కొన్నారు.
More Stories
సైఫ్ అలీఖాన్ కుటుంభం రూ. 15,000 కోట్ల ఆస్తుల జప్తు!
మహా కుంభమేళాతో 12 లక్షల ఉద్యోగాలు
అటల్ పెన్షన్ యోజన రూ.10వేలకు పెంపు?