జులై 1 వరకు పోలీస్ రిమాండుకు తీస్తా సెతల్వాడ్‌

గుజరాత్‌ అల్లర్ల కేసులో ఫోర్జరీ, నేరపూరిత కుట్ర దర్యాప్తు ప్రక్రియను అవమానించారనే అభియోగాలపై నమోదైన కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను గుజరాత్‌ సర్కారు ఏర్పాటు చేసింది. గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం డీఐజీ దీపన్‌ భాద్రాన్‌ నేతృత్వంలో సిట్‌ కొనసాగుతుంది. 
 
అరెస్టయిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌, మాజీ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌లను అహ్మదాబాద్‌ కోర్టు వారం రోజుల (జులై 1 వరకు) పోలీసు కస్టడీకి అనుమతినిచ్చింది. శనివారం ముంబైలో అదుపులోకి తీసుకున్న తీస్తా సెతల్వాడ్‌ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్టు చూపారు.
ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, నేర విచారణ వ్యవహారాలను అవమానించడం, గాయపర్చడానికి కారణం కావడం తదితర ఆరోపణలు ఆమెకు వ్యతిరేకంగా తాజా నమోదు కావడంపై ఈ అరెస్టు జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.  శనివారం నాడు గుజరాత్ మాజీ డిజిపి ఆర్‌బి శ్రీకుమార్‌ను కూడా క్రైమ్ బ్రాంచి అరెస్టు చేసింది. మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్‌ను కూడా నిందితుడిగా పేర్కొన్నారు. అయితే వేరే కేసులో ఆయన జైల్లో ఉన్నారు. 
 
2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సెతల్వాడ్, శ్రీకుమార్, సంజీవ్ భట్ దర్యాప్తు కమిషన్ సిట్‌కు, కోర్టులకు సమర్పించిన డాక్యుమెంట్లను క్రైమ్ బ్రాంచి సేకరిస్తుందని క్రైమ్ బ్రాంచి డిసిపి చైతన్య మాండలిక్ వివరించారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు. 
 
నేరపూరిత కుట్రలో అనేక మంది ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే నిందితులు శ్రీకుమార్ కానీ, సెతల్వాడ్ ర్యాప్తుకు సహకరించడం లేదని మాండలిక్ చెప్పారు.  ఇదిలా ఉండగా సెతల్వాడ్ తన ప్రాణాలకు ముప్ప ఉందని ఆరోపించారు.తనను గుజరాత్‌కు తీసుకొచ్చేటప్పుడు పోలీసులు చేయి చేసుకున్నారని సెతల్వాడ్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు.