మొత్తం ప్రపంచంలోనే ఇతర దేశాలకన్నా చాలా ముందుగా అత్యధిక శాతం ప్రజలకు టీకాలు వేయగలగడంతో కరోనా మహమ్మారితో భారత్ లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పిన్నట్లు పలు అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా, టీకాల వల్ల మన దేశంలో 2021లోనే 42 లక్షల మరణాలు తగ్గాయని బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ లండన్ అధ్యయనంలో వెల్లడైంది.
దీనికి సంబంధించిన నివేదిక లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8, 2020 నుంచి డిసెంబర్8, 2021 మధ్య మరణాలపై నిపుణులు అధ్యయనం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలో 5,24,941 మంది కరోనాతో చనిపోయారు.
వాస్తవానికి ఈ సంఖ్య 10 రెట్లు అధికంగా ఉండేదని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. అటువంటి అధ్యయనాల ప్రాతిపదికను భారత్ ఖండించడం తెలిసిందే. భారత దేశంలో టీకాలు రాకపోయి ఉంటే 2021లోనే 27 లక్షల నుంచి 53 లక్షల మంది చనిపోయేవారని ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకుడు ఒలివెర్ వాట్సన్ వివరించారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా 2021లో 3.14 కోట్లకు పైగా జనాలు చనిపోయేవారని వాట్సన్ పేర్కొన్నారు. టీకాల రాకతో 2 కోట్ల మరణాలు తగ్గాయని తెలిపారు. 185 దేశాల్లో అప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. 2021 చివరి నాటికి రెండు లేదా అంతకంటే ఎక్కువ డోసులు ప్రతి దేశంలోని 40 శాతం జనాభాకు వేయాలన్న డబ్ల్యూహెచ్ఓ లక్ష్యం నెరవేరి ఉంటే.. మరో 5,99,300 ప్రాణాలు దక్కేవని తెలిపారు.
అయితే, ఈ అధ్యయనంలో రోజూ 17,000కుపైగా కేసులు నమోదైన చైనాను పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. విశ్వసనీయ గణాంకాలు ఆ దేశంకు సంబంధించి లేకపోవడమే అందుకు కారణం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇలా ఉండగా, మనదేశంలో ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒకే రోజు 17 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 4 నెలల్లో అత్యధికంగా శుక్రవారం 17,336 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు రోజు 13 వేల పైచిలుకు మందికి వైరస్ సోకితే,ఒక్కరోజులోనే కొత్త కేసుల సంఖ్య 4,294 కు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
రోజువారీ కేసుల్లో ఏకంగా 30 శాతం పెరుగుదల నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 88,284కు పెరిగింది. వైరస్ బారిన పడి గడిచిన 24 గంటల్లో 13 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,33,62,294కి, మొత్తం మరణాల సంఖ్య 5,24,954 కి చేరుకుంది.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్