కశ్మీరులో చొరబాటుకు 150 మంది తీవ్రవాదులు

జమ్మూ కశ్మీరులోకి చొరబడేందుకు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) వెంబడి దాదాపు 150 మంది తీవ్రవాదులు ఎదురుచూస్తున్నారని, అక్కడి 11 తీవ్రవాద శిక్షణ శిబిరాలలో మరో 500 నుంచి 700 మంది తీవ్రవాదులు శిక్షణ పొందుతున్నారని ఒక సీనియర్ సైనికాధికారి శనివారం వెల్లడించారు. 
 
కశ్మీరులో వాస్తవాధీన రేఖ వెంబడి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయని ఆయన తెలిపారు. ఎల్‌ఓసి వెంబడి ఉన్న మన్షేరా, కోట్లి, ముజఫరాబాద్‌లోని 11శిక్షణా శిబిరాలలో 500 నుంచి 700 మంది తీవ్రవాదులు శిక్షణ పొందుతున్నారని తన పేరును వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు. 
 
నిఘా వ్యవస్థ సమాచారం ప్రకారం జమ్మూ కశ్మీర్ లోకి చొరబడేందుకు పాక్ ఆక్రమిత కశ్మీరులోని స్థావరాల వద్ద సుమారు 150 మంది తీవ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. 
 
ఈ ఏడాది ఇప్పటివరకు కశ్మీరులోకి ఒక్క చొరబాటు యత్నం సఫలీకృతం కాలేదని ఆయన చెప్పారు. గుర్తించని మార్గాల కన్నా కొత్త మార్గాల ద్వారా చొరబాటు జరిపేందుకు తీవ్రవాదులు దృష్టి కేంద్రీకరించారని ఆయన వివరించారు.