తెలంగాణాలో పెరుగుతున్న కేసులు … హీరో బాలకృష్ణకు కరోనా

సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని బాలకృష్ణ కోరారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించిన బాలకృష్ణ.. త్వరలోనే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. 
కాగా, తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు  అధికమవుతున్నాయి. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. మరోసారి నిబంధనలు తీసుకొచ్చింది. గురువారం 494 కేసులు నమోదయితే.. గత 24 గంటల్లో 493 కేసులు రికార్డు అయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 
 
219 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 90, 692 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.07 శాతంగా ఉందని, మొత్తం 29 వేల 084 టెస్టులు నిర్వహించడం జరిగిందని వెల్లడించింది. 
 
20 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు వేగంగా పెరుగుతోంది. ఈ వారం రోజుల లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా 3.62 శాతం పాజిటివిటీ రేటు రికార్డయ్యింది. హైదరాబాద్‌లో 2.98 శాతం, మేడ్చల్‌ జిల్లాలో 1.93 శాతంగా ఉంది. 
 
వీటితో పాటు యాదాద్రి, వికారాబాద్‌, ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌‌, సూర్యాపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మంచిర్యాల, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌‌, అదిలాబాద్‌, నారాయణపేట్‌, మహబూబాబాద్‌, గద్వాల, వనపర్తి జిల్లాల్లో పాజిటివిటీ రేటులో పెరుగుదల నమోదైంది. మిగిలిన జిల్లాల్లో స్వల్పంగా తగ్గుదల నమోదవడం గమనార్హం.
 
 పది రోజుల క్రితం వరకూ గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని 3 జిల్లాల్లోనే కేసులు పెరుగుతుండగా.. ఇప్పుడు ఏకంగా 20 జిల్లాల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ నుంచి రాకపోకలతో రాష్ట్రవ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు స్ప్రెడ్ అవుతున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
 
కేసుల్లో 66 శాతం బీఏ2.1 వేరియంట్‌వేనని, ఇది ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్ అని  అధికారులు చెబుతున్నారు. వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా గొంతు, తల, ఒళ్లు నొప్పులు, విరోచనాల వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు 4,848 కేసులు నమోదవగా..100 మంది లోపు బాధితులే హాస్పిటళ్లలో చేరి ట్రీట్‌మెంట్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.