‘అగ్నిపథ్’పై తప్పుడు వార్తలు.. 35 వాట్సాప్ గ్రూపులపై వేటు

సైనిక రిక్రూట్‌మెంట్ పథకం ‘అగ్నిపథ్’పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఆ గ్రూపులను నిషేధించిన కేంద్రం తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేసే వ్యక్తులను ట్రాక్ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేసి కటకటాలవెనక్కి పంపింది.
ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని వెరిఫై చేసుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ లైన్‌ను కూడా తెరిచింది. 17  సంవత్సరాల నుంచి 21 ఏళ్ల యువతకు త్రివిధ దళాల్లో స్వల్ప కాలిక ఉద్యోగాల కోసం మంగళవారం ‘అగ్నిపథ్’ పేరుతో రిక్రూట్‌మెంట్ విధానాన్ని ప్రకటించింది. ఇందులో ఉద్యోగం సాధించిన వారు నాలుగేళ్లపాటు అగ్నివీరులుగా సేవలు అందించాల్సి ఉంటుంది.
గతంలో ‘టూర్ ఆఫ్ డ్యూటీ’గా నామకరణం చేసిన అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో ప్రారంభించారు.
నిరసనల్లో పాల్గొనలేదని హామీ ఇవ్వాల్సిందే 
ఇలా ఉండగా, అగ్నిపథ్‌లో చేరే అభ్యర్థులు ఎలాంటి నిరసనల్లో పాల్గొననట్లు ధ్రువపత్రం ఇవ్వాలని మిలటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌పురి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకంపై మిలిటరీలో చేరాలనుకునే యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. 
 
మిలిటరీలో చేరే యువతకు జోష్, హోష్ ఉండాలని.. ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకంలో ఇదొక కీలక అంశమని పేర్కొంటూ హింసాత్మక నిరసనలు చేసేవారికి అగ్నిపథ్ పథకంలో కేంద్రం రాయితీలు ఇవ్వలేదని అనిల్‌పురి తేల్చి చెప్పారు. ఈ సూచనలు ఇప్పటికే అమలులో ఉన్నట్లు ఆయన తెలిపారు. సాయుధ దళాలు క్రమశిక్షణతో ఉంటాయని, క్రమశిక్షణ కలిగిన అభ్యర్థుల దరఖాస్తుదారులు మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నారు.