నేవీలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లు 

భారత నావికాదళంలో మొట్టమొదటిసారి మహిళా సెయిలర్లను తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ నియామకాలను భర్తీ చేయనున్నట్లు నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా 3,000 మంది మహిళా అగ్నివీర్‌లను ఈ ఏడాది తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇది ఇంకా తుది నిర్ణయానికి రాలేదట.

ఈ విషయమై సోమవారం మీడియాతో చీఫ్ ఆఫ్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాటి మాట్లాడుతూ ‘‘అగ్నిపథ్ పథకంలో భాగంగా నేవీ నియామకాల్లో లింగసమానత్వం ఉండేలా చూసుకుంటాం. అందుకే సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మహిళలను సెయిలర్లుగా తీసుకోవాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.

ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందని తెలిపారు. అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన మొదటి బ్యాచ్‌కు ఈ ఏడాది నవంబర్‌ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని వివరించారు.

భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)లో రిక్రూట్‌మెంట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభమవుతుందని, మొదటి దశ ఆన్‌లైన్‌ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుంచి మొదలవుతుందని  ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌.కె.ఝా తెలిపారు. ఐఏఎఫ్‌లో అగ్నిపథ్‌   కింద మొదటి బ్యాచ్‌ అభ్యర్థులకు ఈ ఏడాది డిసెంబర్‌ 30 నాటికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఇక అగ్నిపథ్‌లో చేరే అభ్యర్థులు ఎలాంటి నిరసనల్లో పాల్గొననట్లు ధ్రువపత్రం ఇవ్వాలని మిలటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్‌పురి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకంపై మిలిటరీలో చేరాలనుకునే యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.

మిలిటరీలో చేరే యువతకు జోష్, హోష్ ఉండాలని.. ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకంలో ఇదొక కీలక అంశమని ఆయన అన్నారు. హింసాత్మక నిరసనలు చేసేవారికి అగ్నిపథ్ పథకంలో కేంద్రం రాయితీలు ఇవ్వలేదని అనిల్‌పురి స్పష్టం చేశారు. ఈ సూచనలు ఇప్పటికే అమలులో ఉన్నట్లు ఆయన తెలిపారు.

సాయుధ దళాలు క్రమశిక్షణతో ఉంటాయని, క్రమశిక్షణ కలిగిన అభ్యర్థుల దరఖాస్తుదారులు మాత్రమే స్వీకరించబడతాయని ఆయన పేర్కొన్నారు. కాగా, సైన్యంలో అగ్నిపథ్‌ నియామకాలకు సోమవారం(నేడు) డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్‌ జనరల్‌ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్‌లో 25,000 మందికి డిసెంబర్‌ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు.

రెండో బ్యాచ్‌ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు.