శీతాకాల సమావేశాల నాటికి కొత్త పార్లమెంట్ భవనం

వచ్చే పార్లమెంట్‌ శీతకాల సమావేశాలను నూతనంగా నిర్మిస్తున్న భవనంలో నిర్వహించే అవకాశం ఉందని స్పీకర్‌ ఓం బిర్లా ఆదివారం తెలిపారు. శీతాకాల సమావేశాలను కొత్త పార్లమెంట్‌ భవనంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ కొత్త భవనం ఆత్మనిర్భర్‌ భారత్‌ను తెలియజేస్తుందని చెప్పారు.
పాత భవనంతో పోలిస్తే ఈ కొత్త భవనం సాంకేతికంగా, భద్రతా పరంగా అత్యాధునికంగా ఉంటుంది. పాత భవనం కూడా దీనిలో ఒక భాగంగా ఉంటుందని స్పీకర్ పేర్కొన్నారు. పార్లమెంట్ పనితీరు బాగా మెరుగుపడిందని, ప్రతి ఒక్కరూ సహకరించడంతో అర్ధరాత్రి వరకు సభ నడుస్తోందని ఓం బిర్లా తెలిపారు.
ఇందుకోసం తరచూ ఆయా పార్టీల నేతలతో తాను చర్చిస్తున్నట్టు చెప్పారు. వారి సహకారంతో సభ పనితీరు, చర్చల సమయం గణనీయంగా మెరుగు పడ్డాయని వెల్లడించారు. ఇటీవల పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ అక్టోబర్ నాటికి కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు.