అగ్నిపథ్ గురుకులం వంటిదన్నకంగనా 

కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీంలో కూడా ఎంతో లోతైన అర్థం ఉందని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తెలిపారు.  ఈ స్కీం ఏదో డబ్బు సంపాదనకో, భవిష్యత్‌ను నిర్మించుకోవడానికో, ఉపాధి కల్పనకో కాదని ఆమె స్పష్టం చేశారు. అప్పటి రోజుల్లో ప్రతీ ఒక్కరూ గురుకులానికి వెళ్లేవారని.. ఈ ‘అగ్నిపథ్’ కూడా అలాంటిదేనని ఆమె పేర్కొన్నారు.
సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’పై ఆర్మీ అభ్యర్థులు చేస్తున్న దేశవ్యాప్త ఆందోళనలను ప్రస్తావిస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో ఇలాంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.  ఇజ్రాయెల్‌ లాంటి చాలా దేశాల్లో అక్కడి యువతకు సైన్యంలో శిక్షణను ఆయా దేశాలు తప్పనిసరి చేశాయని కంగనా తెలిపింది.
కొన్నేళ్లు ప్రతీ ఒక్కరూ ఆర్మీలో పనిచేయడం ద్వారా జీవితంలో ఎలా విలువలతో జీవించాలో తెలుసుకుంటారని, క్రమశిక్షణ, జాతీయత భావం.. దేశ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షించడం ఎలాగో తెలుసుకుంటారని ఆమె చెప్పింది. డ్రగ్స్, పబ్జీ లాంటి వాటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత శాతం షాక్‌కు గురిచేస్తోందని, ఇలాంటి సంస్కరణలు కచ్చితంగా అవసరమేనని కంగనా స్పష్టం చేశారు.
ఆందోళనల్లో పాల్గొంటే అవకాశాలు పోయినట్లే 
ఇలా ఉండగా,  అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ రోడ్లెక్కి ఆందోళనల్లో పాల్గొంటున్న ఉద్యోగార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అలాంటివారికి పోలీస్‌ క్లియరెన్స్‌ రాదని, ఫలితంగా త్రివిధ దళాల్లో చేరే అవకాశం చేజారిపోతుందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌చౌధురి హెచ్చరించారు.
సైన్యంలో చేరగోరేవారినుంచి ఇలాంటి హింస, విధ్వంసం ఊహించలేదని, అలాంటివారిని సమర్థించలేమని, వారికి సైన్యంలో చేరే అవకాశాలు తక్కువేనని స్పష్టం చేశారు. సైన్యంలో చేరాలంటే అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ పోలీసుల క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కీలకమని ఆయన గుర్తు చేశారు. అల్లర్లలో పాలుపంచుకుంటే ఆ సర్టిఫికెట్‌ ఇవ్వరని, అది లేకుండా సైన్యంలో చేరడం సాధ్యం కాదని తెలిపారు.