శ్రీలంకకు బాసటగా నిలబడదాం 

తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఇటువంటి క్లిష్ట తరుణంలో బాసటగా నిలబడాల్సిన అవసరం వుందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ పేర్కొన్నారు. శనివారం జరిగిన శ్రీలంకపై పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఆయన తెలిపారు.
ఆ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ” వివిధ అంశాలపై, భారత్‌ పాత్రపై సానుకూల వాతావరణంలో మంచి చర్చ జరిగింది.” అని జై శంకర్‌ వ్యాఖ్యానించారు. పొరుగు దేశంగా మనం భారత్‌కు ఆపన్న హస్తం అందించాల్సి వుందని తెలిపారు.
 ఈ సమావేశానికి శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది, డిఎంకె నేత తిరుచి శివలతో పలువురు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. వంట గ్యాస్‌, పెట్రోల్‌ వంటివి దొరకడమే దుర్లభంగా మారింది. శ్రీలంకకు మొత్తంగా  5100కోట్ల డాలర్ల విదేశీ రుణాలు పేరుకుపోయాయి. ఈ ఏడాది జనవరి నుండి భారత్‌ సాయమందిస్తూనే వుంది.

శ్రీలంకలో ప్రభుత్వ కార్యాలయాల మూత

ఇలా ఉండగా, ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన శ్రీలంకలో ఇంధన నిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్య సిబ్బందిని కొనసాగించాలని ఆదేశించింది. కొలంబోలోని స్కూళ్లను వచ్చే వారం మూసివేస్తున్నట్టు విద్యా మంత్రి వెల్లడించారు.
కాగా, లంకలో ప్రభుత్వ బంజరు భూములను సాగులోకి తెచ్చి ఆహార ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్నారు. 1500 ఎకరాల పడావు భూమిని సాగుయోగ్యంగా మార్చే బృహత్తర యజ్ఞంలో శ్రీలంక సైన్యం పాలుపంచుకోనుంది. దేశంలో ఆహార భద్రతను పెంపొందించే దిశగా గ్రీన్‌ అగ్రికల్చర్‌ స్టీరింగ్‌ కమిటీ (జీఏఎ్‌ససీ)ని ఆర్మీ ఏర్పాటు చేసింది.