అసోం, మేఘాలయ, త్రిపురలలో భారీ వర్షాలు

అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో వరదల కారణగా ఇప్పటి వరకు 55 మంది మరణించారు. వరదల మృతుల సంఖ్య 25కు పెరిగిందని అసోం అధికారులు ప్రకటించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 8 మంది ఆచూకీ గల్లంతయ్యింది.  మేఘాలయలో 19 మంది మృతి చెందారు. వేలాదిమంది నిరాశ్రయులుగా మారారు.
కుండపోత వర్షం కారణంగా పశ్చిమ త్రిపుర జిల్లాలోని సదర్ సబ్‌డివిజన్‌లో వరదల కారణంగా 2,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని అధికారులు జూన్ 18న తెలిపారు. “వారు 20 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు” అని అధికారులు చెప్పారు.
 32 జిల్లాలోని 31 లక్షల మంది అసోం వాసులపై వరదలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని అధికారులు వివరించారు. అస్సాంలో 605 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇళ్లు నీట మునగడంతో లక్షా ఎనిమిదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 235 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం హిమాంత శర్మ పర్యటించి, పరిస్థితిని తెలుసుకున్నారు.
బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదుల వదరల్లో మొత్తం 4,291 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 66455.82 హెక్టార్ల మేర పంట నీట మునిగింది. ఇక్కడి పరిస్థితిపై ముఖ్యమంత్రి హిమాంత శర్మతో ప్రధాని నరేంద్ర మోదీ  సంభాషించారు. సహాయక చర్యలు తీసుకోవాలని, కేంద్రం అండగా నిలుస్తుందని హామీనిచ్చారు.
ఇటు మేఘాలయలోని చిరపుంజి, మౌసిన్‌రామ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 1940 ఏల్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. కాగా, ఈ వర్షాలకు 19 మంది చనిపోగా.. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సంగ్మా రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు.
పశ్చిమ త్రిపుర జిల్లాలో గత 24 గంటల్లో 155 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  దీనివల్ల హౌరా నది ఒడ్డున ఉన్న పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. “హౌరా నదిలో నీటి మట్టం ప్రమాద స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ప్రవహిస్తోంది, అగర్తలా దక్షిణ ప్రాంతాల్లోని అనేక లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. మరింతగా వర్షాలు కురిస్తే పరిస్థితి ఇంకా దిగజారవచ్చు” అని అధికారులు తెలిపారు.