సీఏపీఎఫ్,అస్సాం రైఫిల్స్‌లో అగ్నివీర్ లకు 10శాతం రిజర్వేషన్

దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో అగ్నిపథ్‌పై హోంశాఖ శనివారం కీలక ప్రకటన చేసింది.సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నివీర్‌లకు సూచించిన గరిష్ఠ వయో పరిమితి కంటే 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  నిర్ణయించింది.
అగ్నివీర్ యొక్క మొదటి బ్యాచ్ కోసం సూచించిన గరిష్ఠ వయోపరిమితి కంటే 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా భారీ హింసాత్మక నిరసనల కారణంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.
 
ఇలా ఉండగా, అగ్నిపథ్ పథకంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటంతో బిహార్‌లోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జూన్ 19 వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని ప్రకటించింది. వదంతులను వ్యాపింపజేయడం కోసం ఇంటర్నెట్ మీడియంను వాడుకుంటున్నందువల్ల ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. 
శాంతి, సామరస్యాలను దెబ్బతీయడానికి, ప్రజల జీవితాలు, ఆస్తులకు నష్టం కలిగించడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి అవకాశం కల్పించే వదంతులను వ్యాపింపజేయడం కోసం అభ్యంతరకరమైన అంశాలను ప్రసారం చేయడం కోసం ఇంటర్నెట్ మీడియంను వాడుకుంటున్నందువల్ల ఈ చర్యలు తీసుకున్నారు.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లేదా అప్లికేషన్స్ ద్వారా ఏదైనా చిత్రాల రూపంలోని కంటెంట్ లేదా ఏదైనా సబ్జెక్ట్‌కు సంబంధించిన కంటెంట్‌ను ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి లేదా కొందరు వ్యక్తుల సమూహానికి ఇచ్చి, పుచ్చుకోవడాన్ని ప్రసారం చేయవద్దని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వాట్సాప్, ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, స్కైప్, స్నాప్‌చాట్ వంటి వాటి ద్వారా సందేశాల ప్రసారాన్ని నిలిపేయాలని ఆదేశించింది.
బీజేపీ నేత ఇళ్ళపై దాడి
మరోవంక, బిహార్ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి ఇంటిపై నిరసనకారులు శుక్రవారం దాడి చేశారు. అనంతరం ఆమె అగ్నిపథ్ పథకాన్ని సమర్థించారు. ప్రతిపక్షాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రతిపక్షాల మద్దతుగల గూండాలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
బిహార్ బీజేపీ  అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ ఇంటిపై కూడా దాడి జరిగింది. తన ఇంటిని పేల్చేయాలనే ఉద్దేశంతోనే వీరు వచ్చారని, వీరు నిరసనకారులు కాదని, దుండగులని ఆగ్రహం వ్యక్తం చేశారు.