పోటీతత్వ సూచీలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్

ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (ఐఎండి) అధ్యయనంలో భారత్ ఆరు స్థానాలు ఎగబాకి , 43 వ ర్యాంకు నుంచి 37 వ ర్యాంకుకు చేరింది. దీంతో ఆసియా ఆర్థిక వస్థలో మనదేశం వేగవంతమైన పెరుగుదలను కనబరిచింది. 
ఈ పోటీతత్వ సూచీలో 63 దేశాల జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అంతకు ముందు ఏడాది అది మూడో స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్ మొదటి స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానానికి పరిమితమైంది. సింగపూర్ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది.
స్వీడన్, హాంకాంగ్, నెదర్లాండ్స్, తైవాన్, ఫిన్లాండ్ , నార్వే, యూఎస్‌ఎ, మొదటి పది ర్యాంకులు సాధించాయి. ఆసియాలో ఆర్థిక వ్యవస్థలో సింగపూర్(3),హాంకాంగ్ ( 5) తైవాన్ ( 7), చైనా (17) మెరుగైన స్థానాలు పొందాయి.
 
ఆర్థిక వ్యవస్థ పనితీరు లోని ప్రతిఫలాలు భారత్ ర్యాంకు మెరుగయ్యేందుకు దోహదం చేసినట్టు ఐఎండీ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ అనూహ్యమైన పెరుగుదలను నమోదు చేసిందని తెలిపింది. వ్యాపార సామర్థ పారామీటర్లలో కీలకమైన లేబర్ మార్కెట్ 15 వ స్థానం నుంచి 6 వ స్థానానికి చేరుకుంది. 
 
అలాగే నిర్వహణ పద్ధతులు, వ్యాపార విలువలు, ఇక్కడ కీలకంగా మారాయని చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రెట్రో స్పెక్టివ్ పన్నుల్లో మెరుగులు దిద్దడం వ్యాపార రంగంలో నమ్మకాన్ని పునరుద్ధరించిందని పేర్కొంది. 
 
అలాగే వాతావరణ మార్పులు అంశంపై భారత్ చురుగ్గా పనిచేస్తుండటం కలిసొచ్చింది. అయితే, వాణిజ్య అంతరాయాలు, ఇంధన భద్రత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మహమ్మారి తర్వాత అధిక జీడీపీ వృద్ధిని కొనసాగించడం వంటి సవాళ్లు ఉన్నాయని వెల్లడించింది.