ఈ ఏడాది చివరికి 20 నుంచి 25 నగరాల్లో 5జి

ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 20 నుంచి 25 నగరాల్లో 5జి నెట్ వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విదేశాలతో పోల్చితే 5జీ రేట్లు దేశంలో తక్కువగానే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని మొబైల్ డేటా చార్జీలు ప్రపంచంలోనే చాలా తక్కువని వెల్లడించారు.
‘విశ్వసనీయ నెట్వర్క్ ప్రొవైడర్ల జాబితాలో భారతదేశం పేరు అగ్రస్థానంలో ఉంది. భారతదేశం అభివృద్ధి చేసిన సాంకేతికతపై ప్రపంచం ఆసక్తి చూపుతోంది’ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డేటా రేట్లు సగటున 25 డాలర్లు ఉండగా దేశంలో కేవలం 2 డాలర్లగా ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో 5జి డేటా రేట్లు కూడా దీనికి అనుగుణంగా తక్కువగానే ఉంటాయని చెప్పారు. ‘భారత టెలికామ్ కొత్త శకానికి 5జి నాంది’ అని అభివర్ణించారు. 5జి టెక్నాలజీతోపాటు రాబోయే 6 జి టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామి దేశంగా ఆవిర్భవించే సమయం ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు.
కాగా, 5జీ స్పెక్ట్రం బ్యాండ్ల వేలానికి కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెలాఖరులో వేలం జరుగవచ్చని భావిస్తున్నారు. 72 జీహెడ్జ్‌ను 20 సంవత్సరాలకు అమ్మనున్నారు. 5జి సేవలు 4జి కంటే పది రెట్లు వేగంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.