జులై 3న హైదరాబాద్ లో బిజెపి బహిరంగ సభలో మోదీ

జులై 2, 3, 4 తేదీల్లో భారతీయ జనతా పార్టీ  జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌, నోవాటెల్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా  3న పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా స్థానిక నేతలు తదితరులు పాల్గొననున్నారు. 
 
రెండు రోజుల పాటు ప్రధాని మోదీతో హైదరాబాద్‌లో రోడ్డు షో నిర్వహించాలని భావించిన బీజేపీ రోడ్డు షో కంటే భారీ బహిరంగ సభ మంచిదనే నిర్ణయానికొచ్చింది. ముఖ్యనేతల సమావేశంలో మోదీ బహిరంగ సభపై తరణ్ చుగ్, బండి సంజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ తెలిపారు. 
 
హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, 350 మంది ప్రతినిధులు వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరుగుతాయని లక్ష్మణ్ చెప్పారు.
 
కాగా,  కార్యవర్గ సమావేశాల ఏర్పాట్ల నిమిత్తమై ఓ ప్రత్యేక కార్యాలయాన్ని మంగళవారం డా. లక్ష్మణ్ ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో తరుణ్ ఛుగ్, ఇతర నేతలు పాల్గొన్నారు.