రాజీనామాకు వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ ససీమిరా!

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన అమ్నీషియా పబ్‌ మైనర్‌ రేప్‌ కేసులో వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ మసివుల్లా కొడుకు నిందితుడిగా ఉండడంతో, ఆయనను ఈ పదవికి నామినేట్ చేసిన టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. పైగా, నిందితులు ఆయన కారునే ఉపయోగించారని అభియోగాలు వస్తున్నాయి. 
 
ఈ సంఘటన జరిగినప్పట్నుంచీ ఛైర్మన్‌ పదవికి ఆయన అనర్హుడని, రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అంతేకాదు, ఆయనతో రాజీనామా చేయించాలని హోం మంత్రి మహమూద్‌ అలీ కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. రాజీనామా చేయాలని వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశాలు కూడా జారీ చేసింది. 
 
అయితే.. తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని మసివుల్లా స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తున్నది.   తనను పదవి నుంచి ఎవరూ తప్పించలేరని వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ ధీమాగా చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడవలసి ఉంది. 
 
మరోవంక, ఈ గ్యాంగ్ రేప్‌ కేస్‌ నిందితులను ట్రయల్‌ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డ్‌ను పోలీసులు కోరారు. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తరువాత ట్రయల్‌ జరిగే సమయంలో ఐదుగురిని అడల్ట్‌లుగా పరిగణించాలని జువైనల్‌ జస్టిస్‌కు హైదరాబాద్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
 
 పోలీసుల విజ్ఞప్తిపై జువైనల్‌ జస్టిస్‌ దే తుది నిర్ణయం. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడనికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని జువైనల్‌ జస్టిస్‌ నిర్ణయాన్ని వెల్లడించనుంది.
 కాగా, బాలికపై గ్యాంగ్‌రేప్‌ కేసులో నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మైనర్లతో మాలిక్‌కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసులో ఆరుగురు నిందితులు కాకుండా ఇతర వ్యక్తులపైనా ఆరా తీస్తున్నారు.  ఐదుగురు మైనర్లను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్‌ దాఖలు చేశారు. మైనర్లను కస్టడీకి ఇస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
 
జూబ్లీహిల్స్‌లో మైనర్‌పై గ్యాంగ్‌రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌కు నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిందని పోలీసులు చెబుతున్నారు. నేటి నుంచి అతణ్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. 
 
ఇదే ఘటనకు సంబంధించి జువైనల్‌ హోంలో ఉన్న మరో ఐదుగురు మైనర్లను కూడా విచారిస్తామని, కోర్టు అనుమతికోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని వివరించారు. ఇప్పటికే లభించిన ఆధారాలతో పాటు.. సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.