అన్నదాతల ఆదాయం పెంపే వ్యవసాయ శాస్త్రవేత్తల లక్ష్యం కావాలి 

ఆహార భద్రత, అన్నదాతల ఆదాయ పెంపే లక్ష్యంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉండాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్  విశ్వభూషణ్‌ హరిచందన్‌ కోరారు. జాతీయ స్థాయిలో చిన్న, సన్నకారు రైతుల ఆదాయం తక్కువగా ఉండడం, తరచూ పంట నష్టాలు సంభవించడం, మార్కెట్‌ ఒడిదుడుకులు, అప్పుల్లో కూరుకుపోవడం వంటి అంశాలపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. 
 
ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 52, 53వ స్నాతకోత్సవ వేడుకలు ఏకకాలంలో బుధవారం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొని మాట్లాడుతూ జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 2019-20లో 17.8 శాతమని, 2021లో 19.9 శాతం సాధించడంలో రైతుల కృషి అభినందనీయమని తెలిపారు. 
 
జాతీయ వరి ఉత్పత్తిలో మూడో వంతు ఎన్‌జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం రూపొందించిన విత్తన రకాలే ఉన్నాయని, ఇది వర్సిటీ సాధించిన పరిశోధన ప్రగతికి లభించిన గౌరవమని కొనియాడారు.  వేరుశనగలోనూ 95 శాతం వ్యవసాయ వర్సిటీ రూపొందించిన రకాలే ఉన్నాయని పేర్కొన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలకు సాంకేతిక సహకారం అందిస్తూ గ్రామీణ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంలో వర్సిటీ సేవలు విశేషమని ప్రశంసించారు. 
 

వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఆచార్య ఎన్‌జి రంగా యూనివర్సిటీ సహకారంతో రైతులకు డ్రోన్‌ టెక్నాలజీతో తక్కువ వ్యయంతో నానో టెక్నాలజీతో మందులు చల్లడం వంటివి అందిబాటులోకి తెచ్చిందని తెలిపారు.

 

అనంతరం స్నాతకోత్సవంలో భాగంగా 2018-19, 2019-20 విద్యా సంవత్సరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో బి.ఎస్సీ (వ్యవసాయం) పూర్తి చేసిన 1544 మందికి, పిజి పూర్తి చేసిన 328 మందికి, 91 మంది పిహెచ్‌డి విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. 
 
ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ 52, 53వ సంయుక్త స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన గైర్హాజరయ్యారు. వీటితో పాటు వర్శిటీ తొలిసారిగా జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించింది.  అంతకు ముందు స్నాతకోత్సవ ప్రగతి నివేదికను వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి కులపతికి నివేదించారు.