ఓవైసీ, నుపుర్ శర్మ లపై ఢిల్లీలో ఎఫ్ఐఆర్

ఏఐఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు ఈరోజు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఉద్రిక్తలు పెంచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓవైసీపై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం(ఐఎఫ్ఎస్ఓ) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
అలాగే  వివాదాస్పద పూజారి యతి నర్సింగానంద్ పేరును సైతం ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ప్రసంగిస్తూ ఉద్రిక్తల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని ఎఫ్ఐఆర్‌లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వీరితో పాటు సోషల్ మీడియాతో విధ్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైతం ఐఎఫ్ఎస్ఓ కేసులు నమోదు చేసింది.
జర్నలిస్టు సబా నఖ్వీ, హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ పూజా శకున్ పాండే, రాజస్థాన్‌కు చెందిన మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, అనిల్ కుమార్ మీనా, గుల్జార్ అన్సారీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  విద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ గ్రూపులను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించే పరిస్థితులను సృష్టిస్తున్నారనే ఆరోపణలతో వీరిపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.
విద్వేష వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఇతర సోషల్ మీడియా వినియోగదారులపై ఇదే విధమైన సెక్షన్ల కింద రెండవ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక నూపుర్ శ‌ర్మ‌తో పాటు బిజెపి బహిష్కృత నేత న‌వీన్ జిందాల్‌ పైనా ఎఫ్ఐఆర్, న‌మోదైంది. నూపుర్ శ‌ర్మ‌పై సెక్ష‌న్ 153, సెక్ష‌న్ 295ల కింద ఘ‌ర్ష‌ణ‌లు ప్రేరేపించేలా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వంటి అభియోగాలు మోపారు.
 
ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, సమూహాలను రెచ్చగొట్టడం,  ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించినందుకు సోషల్ మీడియా వినియోగదారులపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ సెల్) కెపిఎస్ మల్హోత్రా తెలిపారు. “ఎఫ్ఐఆర్ వివిధ మతాలకు చెందిన బహుళ వ్యక్తులపై ఉంది. అశాంతిని సృష్టించే ఉద్దేశ్యంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడంలో వివిధ సోషల్ మీడియా సంస్థల పాత్రపై మేము దర్యాప్తు చేస్తున్నాము ”అని డిసిపి మల్హోత్రా తెలిపారు.