షారూఖ్‌, కత్రినా, ఫడ్నవీస్‌ లకు కరోనా

ఇటీవల కాలంలో రాజకీయ, సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, ప్రియాంక, అక్షయ్ కుమార్, కార్తిక్‌ ఆర్యన్‌లకు పాజిటివ్‌ అని తేలగా, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ దీని బారిన పడ్డారు. ఆదివారం ఆయనకు పాజిటివ్‌ అని తేలింది.
బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ కూడా కరోనా సోకింది. అందుకే ఆమె ఐఫా 2022లో వేడుకల్లో పాల్గొనలేదు. మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా మరోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్‌ చేశారు. శుక్రవారం నుంచి  ఫడ్నవీస్‌  లాతూర్‌ పర్యటనలో ఉన్నారు.
శనివారం లాతూర్‌లో ఉండగా అస్వస్ధతకు గురికావడంతో పర్యటన ముగించుకు ని సాయంత్రం ముంబైకి చేరుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆదివారం షోలాపూర్‌ పర్యటనను కూ డా రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఫడ్నవీస్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యం అందిస్తున్నామని, ఆందోళ న చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు.
కాగా, షారూఖ్‌ ఖాన్‌ త్వరగా కోలుకోవాలని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. తమ బ్రాండ్‌ అంబాసిడర్‌ షారుఖ్‌ ఖాన్‌ కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు ఇప్పుడే తెలిసిందని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గన్న తర్వాత వీరంతా కరోనా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం షారూఖ్‌ .. అట్లీతో దర్శకత్వంలో జవాన్‌లో నటిస్తున్నారు.

కాగా, దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 4,270 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజే 15 మంది చనిపోయారు. శనివారం 2,619 మందికి పైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సం ఖ్య 98.73 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. 

దేశంలో 34 రోజుల తర్వాత రోజువారీ కరోనా  పాజిటివిటీ రేటు 1 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. దేశవ్యాప్తంగా కేసులు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కరోనాకేసు లు పెరుగుదల ఫోర్త్ వేవ్‌కు సంకేతమా? అనే భయాందోళన ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

కేరళలో శనివారం ఒక్కరోజే 1,544 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో జూన్ నెల ప్రారంభం నుంచి రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

కేరళలో కొత్తరకం నోరో వైరస్
కేరళ రాష్ట్రంలో కొత్తరకం నోరో వైరస్ అంటువ్యాధి ప్రబలింది. తిరువనంతపురం నగరంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యాధికారులు ధృవీకరించారు. నోరోవైరస్ డయేరియా-ప్రేరేపిత రోటవైరస్ మాదిరిగానే ఉంది. ఈ వైరస్ సోకిన పిల్లలకు చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు.
కలుషిత నీరు, ఆహారం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో నీటి పరిశుభ్రతపై సరైన చర్యలు తీసుకుంటే వ్యాధిని అదుపు చేయవచ్చని అధికారులు చెప్పారు.నోరో వైరస్ సోకిన పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రజలంతా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి జార్జ్ చెప్పారు.
ఫుడ్ పాయిజనింగ్ అని ఫిర్యాదు చేసిన తర్వాత పిల్లల్లో నోరోవైరస్ ఇన్ఫెక్షన్ కనుగొన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానిస్తున్నారు.
నోరోవైరస్ సోకిన రోగులు వాంతులు,విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు. కలుషితమైన ఆహారం, నీరు వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది.లావెటరీని ఉపయోగించిన తర్వాత సబ్బుతో పదేపదే చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు ప్రజలను కోరారు.