బిజెపి నుండి నుపుర్ శర్మ బహిష్కరణ

 భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను ఆదివారం పార్టీ నుంచి తొలగించారు. ఆమెతో పాటు మీడియా చీఫ్ నవీన్ జిందాల్‌‌ను సైతం తొలగించారు. పార్టీలో వీరికి పార్టీలో ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వల్లే కాన్పూర్‌లో అల్లర్లు జరిగాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అల్లర్లలో 40 మంది వరకు గాయపడ్డారు.  దీంతో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన అనంతరమే ఇద్దరిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. 
 
నూపుర్ శర్మకు రాసిన లేఖలో, బిజెపి కేంద్ర క్రమశిక్షణా కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ ఇలా అన్నారు: “మీరు పార్టీ వైఖరికి విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తదుపరి విచారణ పెండింగ్‌లో ఉన్నందున, మిమ్మల్ని పార్టీ నుండి, మీ బాధ్యతల నుండి సస్పెండ్ చేసిన్నట్లు మీకు తెలియజేయాలని నన్ను ఆదేశించారు”.

ముహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన ఆరోపణలపై కొనసాగుతున్న వివాదానికి స్పష్టమైన ప్రతిస్పందనగా, బిజెపి “అన్ని మతాలను గౌరవిస్తుంది”, “ఏదైనా వర్గం లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే ఏ భావజాలానికి గట్టిగా వ్యతిరేకం” అని స్పష్టం చేసింది.

“ఏ మతానికి చెందిన వ్యక్తులను అవమానించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఏదైనా ఒక వర్గాన్ని లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే భావజాలానికి వ్యతిరేకం. బిజెపి అటువంటి వ్యక్తులను లేదా తత్వాన్ని ప్రోత్సహించదు” అని బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

“వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలో ప్రతి మతం వర్ధిల్లింది. భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

రజా అకాడమీ ముంబై విభాగం జాయింట్ సెక్రటరీ ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జ్ఞాన్‌వాపి సమస్యపై జరిగిన వార్త చర్చలో శర్మ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. “దుర్వినియోగం” లేదా “తప్పు” ఏమీ చెప్పలేదని శర్మ ఖండించగా, వివాదం చెలరేగినప్పటి నుండి తనకు హత్య, అత్యాచారం బెదిరింపులు వస్తున్నాయని ఆమె ఆరోపించింది.

కాగా, శర్మ ప్రకటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పార్టీ నాయకత్వాన్ని “కలత”, “నిరాశ” కలిగించిందని పార్టీ వర్గాలు స్పష్టం చేశారు. వారు పాలనా సమస్యలలో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ ఫార్ములా గురించి మాట్లాడుతూ ఉంటారని గుర్తు చేశారు.