కరోనా ఉద్ధృతితో  మహారాష్ట్రలో మళ్లీ మాస్క్ తప్పనిసరి

మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఉపక్రమించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ల నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈమేరకు అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులకు రాసిన లేఖలో ఆదేశించారు. 
 
టెస్టింగ్, ట్రాకింగ్ ను వేగవంతం చేయాలని, జిల్లా యంత్రాంగాన్ని సూచించింది. మహారాష్ట్రలో ఇటీవలే బిఎ 4,బిఎ 6 సబ్ వేరియంట్ కేసులు నమోదవ్వడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరింది. 
 
మాస్కులు వాడాలని ప్రజలకు పిలుపునిచ్చామని, తప్పనిసరి చేయలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోప్‌ శనివారం తెలిపారు.  మూడు నెలల తరువాత తొలిసారిగా జూన్ 1 న మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ వెయ్యి దాటింది. శుక్రవారం 1134 కొత్త కేసులు వెలుగుచూడగా, మూడు మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబై లోనే 763 కేసులు బయటపడ్డాయి. యాక్టివ్ కేసులు మళ్లీ 5 వేలు దాటాయి.
కాగా, భారత్‌లో శనివారం 3,962 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల గత 24 గంటల్లో 26 మంది మరణించారు.  కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో రోజుకు 1,000కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి..వారం రోజులుగా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి ఉన్నట్టుండి పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరంగా చేపట్టాలంటూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన చర్యలు చేపట్టడంతో దేశంలో మూడు నెలలుగా కరోనా వ్యాప్తి కట్టడిలోకి వచ్చిందని చెప్పారు.  అయితే ఇటీవల తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాల్లో వందకు పైగా కేసులు నమోదు కావడటంతో మళ్లీ వైరస్‌ నిరోధక చర్యలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 3.13 శాతం కేసులు తమిళనాట నమోదవుతున్నవేనని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికతో తమిళనాడు  రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్‌ జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకంగా లేఖలు రాశారు.