2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలను ఎత్తుకు పోయిన రష్యా

ఉక్రెయిన్‌కు చెందిన 2 లక్షల మంది పిల్లలు బలవంతంగా బుధవారం రష్యాకు ఎత్తుకెళ్లారని, వీరిలో అనాధ పిల్లలు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. తల్లిదండ్రులున్న పిల్లలను వారి కుటుంబాల నుంచి విడదీశారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. 

ఈ నేరపూరిత విధానం పిల్లలను అపహరించడమే కాకుండా వారు ఉక్రెయిన్‌ను మర్చిపోయేలా చేయడం, తిరిగి రాలేకుండా వారిని రష్యా లోనే నిర్బంధించడమేనని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ పిల్లల దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి ఆయన వీడియో ద్వారా మాట్లాడారు.

ఉక్రెయిన్‌కు చెందిన 2 లక్షల మంది పిల్లలు బలవంతంగా బుధవారం రష్యాకు పంపబడ్డారని వీరిలో అనాధ పిల్లలు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. దీనికి బాధ్యులైన వారిని ఉక్రెయిన్ శిక్షిస్తుందని, మొదట ఉక్రెయిన్ ఎన్నటికీ లొంగిపోదని యుద్ధ భూమిలో రష్యాకు రుజువు చేయడమౌతుందని చెప్పారు. 

తమ ప్రజలు లొంగిపోరు, మా పిల్లలు ఆక్రమణదారుల ఆస్తి కాబోరని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. యుద్ధంలో ఇంతవరకు 243 మంది పిల్లలు దారుణంగా హత్యకు గురయ్యారని, 446 మంది గాయపడ్డారని, 139 మంది అదృశ్యమయ్యారని, అదింకా ఎక్కువే ఉంటుందని తెలిపారు. 

రష్యా దళాలు ఆక్రమించుకున్న ప్రాంతాలకు సంబంధించి ఉక్రెయిన్ ప్రభుత్వం వద్ద ఆయా పరిస్థితుల పూర్తి చిత్రం లేదని తెలిపారు. చనిపోయిన 11 మంది పిల్లల పేర్లను తెలియజేస్తూ ఎలా వారు దారుణంగా హత్యకు గురయ్యారో తెలియాలని బాధపడ్డారు.