గుజరాత్ తీరంలో పాక్ పడవ స్వాధీనం

గుజరాత్ తీరంలో పాక్ పడవ స్వాధీనం

గుజరాత్ రాష్ట్ర సముద్ర తీరంలో పాకిస్థాన్ దేశానికి చెందిన పడవను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)లు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థాన్ సముద్ర సరిహద్దుకు సమీపంలోని భారత జలాల్లో బోటు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకుంది.

పాక్ పడవలో నిషిద్ధ వస్తువులతోపాటు ఏడుగురు పాక్ పౌరులున్నారని ఏటీఎస్ అధికారి చెప్పారు. పట్టుకున్న పాక్ పడవను తాము ఓఖా హార్బరులో సోదా చేస్తున్నామని అధికారులు చెప్పారు. భారత జలాల్లో కదులుతున్న పాక్ పడవను తాము ఆపమని ఆదేశించామని, అయితే అది తప్పుంచుకునే విన్యాసాలను ప్రారంభించడంతో దాన్ని అదుపులోకి తీసుకున్నామని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు.

గుజరాత్ సముద్ర తీరంలో ఏప్రిల్ 25వ తేదీన 9 మంది సిబ్బందితో పాటు మరో పాక్ ఓడను పట్టుకోగా అందులో రూ.280 కోట్ల విలువైన హెరాయిన్ దొరికింది. ఇండో-పాకిస్తాన్ సముద్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న హరామి నాలా వద్ద ముగ్గురు మత్స్యకారులతోపాటు 9 ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు.

కాశ్మీర్ పేలుడులో ముగ్గురు సైనికులకు గాయాలు 

కాగా, జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు సైనికులు గాయపడ్డారని గురువారం జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. అద్దెకు తీసుకున్న ప్రైవేట్ వాహనంలో సైనికులు ప్రయాణిస్తుండగా ఈ పేలుడు జరిగిందని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.

ప్రైవేటు వాహనం బ్యాటరీలో పేలుడు పదార్థాలు ఉంచడంతో అది పేలిందని ఐజీ చెప్పారు.ఆర్మీ రహస్య కార్యకలాపాల కోసం కొన్ని సార్లు ప్రైవేటు వాహనాలను వినియోగిస్తుందని, అయితే వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని ఐజీ పేర్కొన్నారు. 

సైనికులు వాడిన ప్రైవేటు వాహనంలో గ్రెనెడ్, పేలుడు పదార్థాల కారణంగా బ్యాటరీ పేలి, ముగ్గురు సైనికులు గాయపడ్డరని ఐజీ తెలిపారు. క్షతగాత్రులైన సైనికులను ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందం వచ్చి పేలుడు ఘటనపై దర్యాప్తు సాగిస్తోంది.