కాశ్మీర్ లో హిందూ బ్యాంకు ఉద్యోగి కాల్చివేత

జమ్మూకశ్మీర్ లో హిందువులపై ఉగ్రవాదుల హింసాకాండ కొనసాగుతోంది. నిరాటంకంగా జరుగుతున్న లక్షిత దాడులలో ఈ సంవత్సరం తొలి ఐదు నెలల్లో 16 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపగా, తాజాగా గురువారం మరొకరిని కాల్చి చంపారు.  దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో హిందూ బ్యాంకు ఉద్యోగిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో మోహన్ పోరా వద్ద ఉన్న ఎల్లక్వై దేహతి బ్యాంక్‌లో పనిచేస్తున్న విజయ్ కుమార్ అనే బ్యాంకు మేనేజరుపై గురువారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన విజయ కుమార్‌ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ సంఘటన షోపియాన్‌కు కేవలం 13 కిలోమీటర్ల దూరంలో జరిగింది. షోపియాన్ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని గోపాల్‌పోరా ప్రాంతంలో ఓ హిందూ మహిళను ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండు రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది.
రజనీ బాలా అనే మహిళ స్కూల్ టీచర్ అని పోలీసులు చెప్పారు. ఆమె తన భర్త, కుమార్తెతో జమ్మూ డివిజన్‌లోని సాంబాలో నివసించింది. కుమార్ హత్య కశ్మీర్‌లో సంచలనం రేపింది. గత వారం బుద్గామ్‌లోని చదూరా ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు  కాల్పులు జరపడంతో టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ మరణించారు.
మే 12న బుద్గామ్ జిల్లాలో రెవెన్యూ శాఖ ఉద్యోగి రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు హతమార్చారు.వరుస సంఘటనలతో జమ్మూకశ్మీరులో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కొన్నాళ్లుగా జమ్ము కశ్మీర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఊచకోతకు పాల్పడుతున్నారని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.