సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు

నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. రాహుల్ ఈ నెల 2న, సోనియా ఈ నెల 8న తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ సమన్లు పంపింది. 
 
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ స్టేట్మెంట్లను రికార్డు చేసేందుకు ఈ సమన్లు పంపినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ మీడియాకు వెల్లడించారు. అయితే మనీలాండరింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు.
 
నోటీసులో పేర్కొన్న తేదీన ఈడీ ముందు సోనియా గాంధీ హాజరవుతారని, కానీ రాహుల్ గాంధీ విదేశాలలో ఉన్నందున కొంత గడువు కావాలని కోరుతూ ఈడీకి లేఖ రాస్తామని ఆయన తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సాల్ లను ఈడీ ప్రశ్నించింది. 
 
 కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. 
 
సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు.  మరోవైపు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జెవాలా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఉద్యమ స్వరాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  తమ నేతలకు నోటీసులు ఇవ్వదాన్ని సరికొత్త పిరికిపంద చర్య అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు.