మంకీపాక్స్‌ను గుర్తించే ఆర్‌టీపీసీఆర్ కిట్

మొత్తం ప్రపంచాన్ని కలవర పెడుతున్న మంకీపాక్స్ వైరస్ గుర్తించే ఓ రియల్‌టైమ్ పీసీఆర్ కిట్‌ను దేశానికి చెందిన మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాస్ హెల్త్‌కేర్ తయారు చేసింది.  ఇప్పటికే బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, కెనడా, అమెరికాలతో సహా 20 దేశాలకు ఈ వైరస్ విస్తరించగా, 200కు పైగా కేసులు బయటపడ్డాయి. మరో 100 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ కట్టడికి పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.
 ఇది నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్. ఇది వన్‌ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్‌లో స్మాల్‌పాక్స్, మంకీపాక్స్ తేడాను గుర్తిస్తుంది. ఈ కిట్ ద్వారా గంట లోనే ఫలితం తెలుసుకోవచ్చునని ట్రివిట్రాన్ వెల్లడించింది. ఈ కిట్‌తో టెస్టు చేసుకునేందుకు పొడి స్వాబ్‌లతోపాటు వీటీఎం (వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియా) స్వాబ్‌లను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
ఈ సందర్భంగా సంస్థ సీఈఓ చంద్ర గంజూ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. . ఈ వ్యాధి వ్యాప్తిని అరకట్టక పోతే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  భవిష్యత్తులో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని డబ్లుహెచ్‌ఒ ప్రతినిధి డాక్టర్ సైల్వై బ్రైండ్ తెలిపారు. మశూచికి వాడే టీకాలు మంకీపాక్స్‌పై పనిచేస్తున్నాయా ? లేదా ? అన్న విషయంపై బ్రిటన్, జర్మనీ, కెనడా , అమెరికాలు పరిశోధన ప్రారంభించారు.
ఈ  నేపథ్యంలో డబ్లుహెచ్‌వో నిపుణుల బృందం కూడా ఈ విషయమై పనిచేస్తోందని, త్వరలోనే మార్గదర్శకాలను అందిస్తామని ఆయన చెప్పారు. మంకీపాక్స్ సోకిన వారిలో ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పులు , చలి, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.  వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారికి ముఖం, చేతులపై దద్దుర్లు, చిన్న బొబ్బలు ఏర్పడవచ్చు. క్రమేపీ అవి ఇతర శరీర భాగాలకు వ్యాపించవచ్చు.