ప్రజలు కుటుంభ పాలన తిరస్కరిస్తారని కేసీఆర్ లో భయం 

తెలంగాణ ప్రజలు తమ కుటుంభం పాలనను తిరస్కరిస్తారనే భయం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును వెంటాడుతుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఆ భయంతోనే భూకంపాలు, ప్రళయాలు సృష్టిస్తున్నారని, సంచలనాల పేరిట ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

 కల్వకుంట్ల కుటుంబం చెబుతున్న గుణాత్మక మార్పునకు కారణం ఆ భయమే అని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంచలనాలు సృష్టిస్తే తమకేం అభ్యంతరం లేదని, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని కేంద్ర మంత్రి హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. 

తెలంగాణలో మార్పు తప్పకుండా వస్తుందని కేంద్ర మంత్రి మరోమారుభరోసా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులని, వారు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకున్న వారినే గెలిపించారని గుర్తు చేశారు. 

ఎన్నికలలో రాజకీయ పార్టీలు వందల కోట్లు ఖర్చు చేసినా సరే ప్రజలు అనుకున్న వారికే ఓట్లు వేస్తారని తెలిపారు. బిజెపిపై ఎంత విషం చిమ్మినా ప్రజలు ఆదరిస్తారని, సిద్ధాంతపరంగా కుటుంబ రాజకీయాలకు బిజెపి వ్యతిరేకమని తేల్చి చెప్పారు. బిజెపిపై ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరని, వచ్చే ఎన్నికలలో ప్రజలు బిజెపికే పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు. 

  మోదీ నాయకత్వాన్ని విమర్శించే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపిలో అధ్యక్షుడికి రెండు దఫాలుగా మాత్రమే అవకాశం ఉంటుందని, జెపి నడ్డా, ప్రధాని మోదీ తరువాత వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఉండరని గుర్తు చేశారు. 

కేంద్ర పథకాలకు పేర్లు మార్చ డం, ఎడాపెడా అప్పులు చేయడం తప్ప తెలంగాణకు కేసీఆర్‌ చేసిందేమిటి? అని కేంద్ర మంత్రి నిలదీశారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం సుంకాలు తగ్గించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి వ్యాట్‌ కూడా తగ్గించకపోవడమేనా గుణాత్మక మార్పు అని ధ్వజమెత్తారు. 

పంచాయతీలకు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది? పేదలకు ఇస్తున్న బియ్యంలో కేంద్రం సబ్సిడీ ఎంత? రాష్ట్రంలో జాతీయ రహదారులను ఇచ్చింది కేంద్రం కాదా? కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సంస్థల సహకారం లేదా? ఈ అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని కిషన్ రెడ్డి సవాల్‌ విసిరారు. 

విభజన హామీలపై పదేపదే మాట్లాడుతున్న కల్వకుంట్ల కుటుంబం  ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేయాలని ఆనాడు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంటే ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. బీజేపీ ప్రభుత్వమే ఈ ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినట్లు టీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.  

మేధా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని స్విస్‌ కంపెనీతో టైఅప్‌ చేశామని, వారు తయారు చేసే ప్రతీ కోచ్‌ను కొనుగోలు చేసేది కేంద్రమే అని కిషన్‌రెడ్డి చెప్పారు. తానేదో కొత్త కంపెనీ తీసుకొస్తున్నట్లు కేటీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రానికి కేంద్రం ఏం ఇవ్వకుండానే ఇంత అభివృద్ధి సాధ్యమైందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎస్‌సి వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ అయితే సుప్రీంకోర్టులో కేసులతో వర్గీకరణ అలస్యం అవుతోందని తెలిపారు.