24 గంటల్లోనే కశ్మీర్ నటి అమ్రీన్ హంతకుల చంపివేత !

కశ్మీరు టెలివిజన్ నటి అమ్రీన్ భట్‌ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. 

వీరిలో ఇద్దరు ఈ నటిని హత్య చేసినవారని జమ్మూ-కశ్మీరు పోలీసులు శుక్రవారం  తెలిపారు. పుల్వామా  జిల్లాలోని అవంతిపొరలో అగన్హంజిపొర ప్రాంతంలో గురువారం రాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. బుడ్గాం  జిల్లాలో టెలివిజన్ నటి అమ్రీన్ భట్‌ను బుధవారం హత్య చేసిన ఇద్దరు ఉగ్రవాదులు షాహిద్ ముష్తాక్ భట్, ఫర్హాన్ హబీబ్ ఈ ఎన్‌కౌంటర్లో మరణించారు.

వీరు లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ లతీఫ్ ఆదేశాల మేరకు అమ్రీన్‌ను హత్య చేశారు. వీరి నుంచి ఓ ఏకే 56 రైఫిల్, 4 మ్యాగజైన్స్, ఓ పిస్తోలును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కశ్మీరు జోన్ ఐజిపి  విజయ్ కుమార్ ఓ ట్వీట్‌లో ధ్రువీకరించారు.

శ్రీనగర్  సిటీలోని సౌర ఏరియాలో మరొక ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. గడచిన మూడు రోజుల్లో కశ్మీరు లోయలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, ఏడుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు.