మహారాష్ట్ర మంత్రి అనిల్ పరాబ్ ఇంట్లో ఈడీ సోదాలు

మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర రవాణా మంత్రి, శివసేన నాయకుడు అనిల్ పరాబ్ (57)కు చెందిన ఏడు కార్యాలయాలపై ఈడీ దాడులు ప్రారంభించింది. ఇవాళ ఉదయమే అనిల్ పారాబ్ అధికార నివాసానికి చేరుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించారు. 
 
పుణెలోని మంత్రి నివాసంతో పాటు, ఆయన రిసార్ట్స్ లో ఏకకాలంలో సోదాలు చేశారు. 2017లో మంత్రి పరాబ్ రత్నగిరి జిల్లా  దాపోలిలో భూమి కొనుగోలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి ఈడీ ఆధారాలు సేకరిస్తోంది.
 
2019లో దాపోలి తీర ప్రాంతంలోని భూమిని కోటి రూపాయలకు కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమిని 2020లో ముంబయికి చెందిన కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్ కు రూ.కోటి 10 లక్షలకు అమ్మేశారు. ఈ భూమిలో 2017 – 2020 మధ్య ఆ భూమిలో మంత్రి పరబ్ తన వ్యాపార భాగస్వామి సదానంద్ తో కలసి నిబంధనలు అతిక్రమించి ఓ రిసార్ట్ ను నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
దీనిపై ఐటీ అధికారులు విచారణ చేసి  రిసార్ట్ నిర్మాణం కోసం రూ.6 కోట్లకుపైగానే నగదు ఖర్చు చేశారని, ఈ డబ్బంతే లెక్కల్లో చూపని డబ్బేనని ఆరోపణలు చేసింది. ఈ మేరకు అభియోగాలు మోపగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. గత ఏడాది మాజీ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసులో మంత్రి అనిల్ పరాబ్ ను విచారించినా  ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని వార్తలు వచ్చాయి.