ముంద్రా పోర్టులో భారీ కొకైన్ స్వాధీనం

గుజరాత్ లోని కచ్ జిల్లాలోని ముంద్రా పోర్టు సమీపంలో ఒక కంటెయినర్ నుంచి రూ.500 కోట్ల విలువైన 56 కిలోల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డిఆర్‌ఐ) స్వాధీనం చేసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు.
 
 స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువను డిఆర్‌ఐ అధికారులు వెల్లడించనప్పటికీ అంతర్జాతీయ మారెట్లలో ఒక కిలో కొకైన్ విలువ దాదాపు రూ.10 కోట్లు ఉండడంతో ఇది దాదాపు రూ.500 కోట్లకు పైగా విలువ చేస్తుందని తెలుస్తోంది. 
 
కొద్ది రోజుల క్రితం వేరే దేశం నుంచి ముంద్రా పోర్టుకు చేరుకున్న ఆ కంటెయినర్‌ను సమీపంలోని సరకు రవాణా స్టేషన్ వద్ద నిలిపిఉంచగా కచ్ఛితమైన సమాచారం ఆధారంగా డిఆర్‌ఐ అధికారులు దాన్ని తనిఖీ చేశారు.
 
 దిగుమతి అవుతున్న వస్తువులలో దాచి ఉన్న 56 కిలోల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల క్రితమే కచ్ జిల్లాలోని కండ్లా పోర్టులో రూ.1300 కోట్లు విలువచేసే 260 కిలోల హెరాయిన్‌ను ఒక కంటెయిన్ నుంచి డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.