రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం జరిగిందా!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (69)పై యత్యాయత్నం జరిగిందా? అవునని చెబుతున్నారు ఉక్రెయిన్ సైనిక అధికారు ఒకరు.  హత్యకు కుట్ర జరిగిందని  ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ కైర్య్లో బుడానోవ్‌ ఓ ప్రకటన చేశారు. నల్ల సముద్రం-కాస్పియన్‌ సీ మధ్య ఉన్న కాకాసస్‌ ప్రాంతంలో పుతిన్‌పై దాడి జరిగిందని, ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలైన కొద్ది రోజులకే ఇది జరిగిందని ఆయన వెల్లడించాడు. 

‘ఉక్రెయిన్‌స్కా ప్రవ్‌డా’ ఈవెంట్‌లో మేజర్‌ జనరల్‌ కైర్య్లో బుడానోవ్‌  పుతిన్‌ హత్యాయత్నం గురించి స్పందించారు. మంగళవారం ఈ పూర్తి ఇంటర్వ్యూ టెలికాస్ట్‌ అయ్యింది. ‘‘పుతిన్‌ హత్యకు ప్రయత్నం జరిగింది. దాడి కూడా జరిగింది. కానీ, తృటిలో ఆయన తప్పించుకున్నారు. కాకాసస్‌ ప్రతినిధులు దీనిని ధృవీకరించారు కూడా. ఇది బయటకు పొక్కని విషయం. పూర్తిగా విఫలయత్నం. మళ్లీ చెప్తున్నా.. రెండు నెలల కిందట ఇది నిజంగానే జరిగింది. విఫలమైంది’’ అని వ్యాఖ్యానించారాయన. 

ఇదిలా ఉంటే 2017 నుంచి ఇప్పటిదాకా (తాజా ప్రకటన మినహాయించుకున్నా..) ఐదుసార్లు హత్యాయత్నం నుంచి బయటపడ్డాడు. అయితే రక్షణ విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, పైగా తన వ్యక్తిగత భద్రత గురించి భయపడకపోవడం గమనార్హం.

ఇలా ఉండగా,  ఉక్రెయిన్‌పై రష్యా దాడులను రష్యన్లు తీవ్రంగా వ‍్యతిరేకిస్తున్నారు. పుతిన్‌ తీరును తప్పుబడుతూ వీధులు, రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రష్యాకు చెందిన సెలబ్రేటీలు, మీడియా ప్రముఖులు బహిరంగంగానే పుతిన్‌ చర్యలను ఖండిస్తున్నారు.

ఈ క్రమంలోనే యుద్ధానికి నిరసనగా వేల సంఖ్యలో రష్యన్లు బహిరంగ లేఖలు రాస్తున్నారు. దీంతో, అక్కడి పోలీసులు.. నిరసనకారులను అరెస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంత మందిని అరెస్ట్‌ చేస్తారంటూ అసభ్యకర పదజాలంతో​ నిరసనలు తెలిపారు.

మరోవంక, ఉక్రెయిన్‌లో రష్యా బలగాల ఆక్రమణ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన దాడులకు ఈరోజుతో మూడు నెలలు గడిచింది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌ భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని చవిచూసింది.

దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని పలు నగరాలను రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇటీవల ఉక్రెయిన్‌లోనే పెద్దదైన అజోస్తోవ్‌ స్టీట్‌ ప్లాంట్‌ తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా ప్రకటించింది. దీంతో, అక్కడ (మరియుపోల్‌లో) యుద్ధం ముగిసిందని రష్యా సైన్యం వెల్లడించింది.