12 దేశాలతో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్

టోక్యోలో క్వాడ్ సమ్మిట్ నేపథ్యంలోనే 12 దేశాలతో కూడిన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పర్టీ (ఐపిఇఎఫ్)ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆవిష్కరించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా వైఖరిని నిలువరించే కీలక ఉద్ధేశంతోనే ఈ అమెరికా అధ్యక్షులు జో బైడెన్ చొరవ తీసుకుని ఈ వేదిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 
 
స్వచ్ఛ ఇంధన, డిజిటల్ రంగ వ్యాపారం , సరఫరాల వ్యవస్థ గొలుసు కట్టుదనం పటిష్టత దిశలో భావసారూప్యత దేశాల మధ్య ప్రగాఢ బంధానికి ఈ నూతన ఏర్పాటుకు దిగారు. మొత్తం 12 దేశాల ప్రాతినిధ్యంతో ఏర్పాటయిన ఈ కూటమిలో భారత్ , జపాన్‌లు కూడా ఉంటాయి.   బైడెన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ప్రపంచ ఆర్థిక ప్రగతికి ఛోదకశక్తిగాఇండో పసిఫిక్ ప్రాంతాన్ని తీర్చిదిద్దే సమిష్టి ఆలోచనలకు ఐపిఇఎఫ్ ప్రారంభం కార్యరూప వాస్తవిక ఆచరణాత్మక ప్రకటన అని ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ  తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు, ఎప్పుడైనా తలెత్తే సంక్లిష్టతల నడుమ అన్ని రకాల సరఫరాలకు విఘాతాల నివారణకు ఇటువంటి ప్రపంచ స్థాయి వాణిజ్య చట్రం అవసరం ఎంతైనా ఉందని ప్రధాని చెప్పారు. 
 
ఎగుమతి-దిగుమతులు, పర్యావరణహిత ఇంధన రంగాలు, అవినీతి నిరోధక చర్యలకు సంబంధించి ఆసియా ఎకానమీలతో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఐపీఈఎఫ్‌ సహకరిస్తుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో-పసిఫిక్‌ ఇంజన్‌గా మారాలని.. ఐపీఈఎఫ్‌ ఒప్పందానికి పరస్పర విశ్వాసం, పారదర్శకత పునాదులు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
 
21వ శతాబ్దంలో తలెత్తే వివిధ సవాళ్లను ఈ ప్రాంతపు భావసారూప్యపు దేశాలతో కలిసి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకే ఈ ఆర్థిక కీలక చట్రం ఏర్పాటు అయినట్లు బైడెన్ తెలిపారు. 
 
నేరుగా ప్రకటించకపోయినా కూటమిని పోలి ఉండే ఈ వాణిజ్య వేదికలో అమెరికా , ఆస్ట్రేలియా, బ్రూనే , ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా , ఇండియా, న్యూజిలాండ్, పిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంలు సభ్యదేశాలుగా ఉంటాయి. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునే దిశగా అమెరికా చొరవతో ఈ కూటమి ఏర్పాటయింది.