26న హైదరాబాద్ కు ప్రధాని మోదీ రాక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్ కు  రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర బిజెపి నేతలు సమాయత్తం అవుతున్నారు. గత వారమే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ పూర్తి కావడం, ఈ యాత్ర సందర్భంగా బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రావడంతో ఉత్సాహంతో ఉన్న బిజెపి కార్యకర్తలకు ప్రధాని పర్యటన మరింత ఉత్సాహం కలిగిస్తున్నది.
కేవలం 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి వస్తుండటం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో సంజయ్ చర్చలు జరుపుతున్నారు.
బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం పలికేలా బండి  ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో కనీవినీ ఎరగని రీతిలో ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.  అగ్రనేతల రాకతో జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక ద్రుష్టి  పెట్టారనే సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.