పాంగాంగ్ సరస్సుపై చైనా మరో బ్రిడ్జి

సరిహద్దు వెంట చైనా దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో భారీ బ్రిడ్జిని డ్రాగన్​ దేశం నిర్మిస్తున్నది. పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ చేపడుతున్న ఈ బ్రిడ్జి నిర్మాణం గతంలో నిర్మించిన బ్రిడ్జికి సమాంతరంగా జరుగుతున్నది.
ఇందుకు సంబంధించి శాటిలైట్​ చిత్రాలు బయటకు వచ్చాయి. భారీ మిలిటరీ వాహనాలు, యుద్ధ ట్యాంకుల రవాణాకు వీలుగా రెండో బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలుస్తున్నది. మొదటి బ్రిడ్జి ప్రాంతంలో మూడు మొబైల్​ టైవర్స్​ను కూడా చైనా ఏర్పాటు చేసింది. ఈ రెండు బ్రిడ్జిలు తూర్పు లడఖ్​కు సమీపంలో ఉన్నాయి.
పాంగాంగ్​ సరస్సు పరిసరాల్లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా ఇట్లా అక్రమణ నిర్మాణాలకు చైనా పూనుకున్నట్లు తెలుస్తున్నది. చైనా తీరును భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి మాట్లాడుతూ.. ‘‘పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నది. 60 ఏండ్ల క్రితం దురాక్రమణ చేసుకున్న ప్రాంతంలో చైనా బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లు తెలుస్తున్నది. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు” అని స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు  తీసుకుంటున్నదని చెప్పారు. 
ఇరు పక్షాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్  చైనా అనేక రౌండ్ల సైనిక స్థాయి చర్చలతో పాటు దౌత్య సమావేశాలను నిర్వహించాయి. అయినప్పటికీ అనేక ప్రదేశాల్లో వాస్తవ నియంత్రణ రేఖ సమీపంలో కొత్త నిర్మాణాన్ని ఆపడంలో ఈ చర్చలు విఫలమయ్యాయి.