సమరసత వల్లనే శాంతి, అభివృద్ధి సాధ్యం

బుద్ధుడు సంవేదన శీలతను, కరుణ, మైత్రి,బందు భావనలను మనకు అందించారని చెబుతూ సమరశత వల్లనే శాంతి,అభివృద్ధి సాధ్యం అని సిక్కిం హైకోర్టు ప్రధాన  న్యాయమూర్తి  జస్టిస్ ఎస్.పి.వాంగ్భి తెలిపారు. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో
బుద్ధ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం సిక్కిం కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్.ఎస్.ఎస్. మూడవ సర్ సంఘ్ చాలక్ బాలా సాహెబ్ దేవరస్ హిందీ ప్రసంగం ” సామాజిక సమత హిందూ సంఘటన” నేపాలీ అనువాదం పుస్తకంను ఆయన ఆవిష్కరించారు. లామ సెవాంగ్ బుద్ధ ప్రార్థనలతో బుద్ధ జయంతి సభ ప్రారంభించారు.  అందరి పట్ల సమభావన తో వ్యవహరించే వాడే బ్రాహ్మణుడు అని చెబుతూ సామాజిక సమరసత నిర్మాణం అందరి బాధ్యత  అని అర్చక,పురోహిత సంఘం సిక్కిం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ ఖనాల్ చెప్పారు.కరోనా సమయంలో అనేక మంది అంత్యేష్టిలను ఆయన స్వయంగా నిర్వహించారు.
 
ముఖ్య వక్తగా పాల్గొన్న సామాజిక సమరసత జాతీయ కన్వీనర్, శ్యామ్ ప్రసాద్ ప్రసంగిస్తూ  నేటి సిక్కిం ప్రాంతాన్ని 8 వ శతాబ్దిలో టిబెట్ కు చెందిన ప్రముఖ బౌద్ధ పండితులు పద్మ సంభవుడు సందర్శించి,” ఈ భూమి అత్యంత పవిత్రమైనది,
దేవతలు నివసించే స్థలం” అని కొనియాడారని తెలిపారు.
 
తర్వాత కాలంలో బౌద్ధ ఆరామాలు ఇక్కడ  వెలిసాయని చెబుతూ 200 పైగా బౌద్ధ ఆరామాలు నేడు ఇక్కడ ఉన్నాయని చెప్పారు.  ఇలాంటి పవిత్ర క్షేత్రం లో బుద్ద జయంతిని సామాజిక సమరసతా వేదిక నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  బుద్ధుడు కులాల అసమానతలను నిరసించాడని, మహిళలకు, నిమ్న వర్గాల ప్రజలకు బౌద్ధ ధర్మ దీక్ష ఇచ్చాడని పేర్కొన్నారు.
ఇది ఆనాడు ఎంతో విప్లవాత్మక చర్య అని తెలిపారు. మన భారత రాజ్యాంగం సామాజిక సమతను, అందరికీ సమాన విలువ కలిగిన వోటు హక్కు ఇవ్వడం ద్వారా రాజకీయ సమానత్వాన్ని,చట్టం ముందు అందరూ సమానమని తెలియ చేసిందని గుర్తు చేశారు.  నేడు కులాల పేరున ఉన్న అసమానతలను,అస్పృశ్యతను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా సామాజిక సమరసత వేదిక పనిచేస్తోందని వివరించారు. 
 
తథాగత బుద్ధుని అనంతరం సమతా మూర్తి శ్రీ రామానుజులు,సంత్ బసవేశ్వరుడు,సంత్ శిరోమణి రవిదాస్,సంత్ కబీరదాస్, గురు నానక్ దేవ్,స్వామి దయానంద సరస్వతి,స్వామి వివేకానందుడు,నారాయణ గురు,సద్గురు మలయాళ స్వామి….ఇలా ఎందరో సామాజిక సమత కోసం కృషి చేశారని శ్యామప్రసాద్ తెలిపారు. వీరు చేపట్టిన పని ఇంకా పూర్తి కాలేదని ఈ పనిని పూర్తి చేయడానికి సామాజిక సమరసత వేదిక కృషి చేస్తోందని చెప్పారు. 
 
నేటి సిక్కింలో 4.6 శాతం ఎస్సీలు, 33.8 శాతం గిరిజనులు ఉండగా,  వీరిలో వివాహాలకు, అంత్యేష్టి సందర్భంగా బ్రాహ్మణ పురోహితులు వేళ్ళని స్థితి ఉంది కదా అని గుర్తు చేశారు. కుల అసమానతలు ఉన్న గ్రామాలలో సైతం అర్.ఎస్.ఎస్. స్వయంసేవకులు గ్రామ పెద్దల సహకారంతో సమస్యలను పరిష్కరించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు.
బుద్ధ జయంతి సందర్భంగా మనం సిక్కిం లోని సామాజిక అసమానతల నిర్మూలనకు నేడు నడుం బిగీద్దాం అని పిలుపిచ్చారు.  భారతదేశానికి పశ్చిమ ఉత్తరాన లాధాఖ్ బౌద్ధ క్షేత్రం ఉంది.మధ్య ఉత్తరాన నేటి నేపాల్ లోని లుంబిని లో క్రీ.పూ 563 లో బుద్ధుడు జన్మించాడు.ఈశాన్యం వైపు పవిత్ర బౌద్ధ క్షేత్రం సిక్కిం ఉంది.ఈ పవిత్ర స్థలాలు నుండి, ఉత్తరం వైపు నుండి సమరసతా పవనాలు భారత దేశమంతటా వీచాలనీ ప్రార్ధిద్దాం  అని సూచించారు.  నూతనంగా సిక్కిం సమరసతా బాధ్యతలను చేపట్టిన తమాంగ్ నౌభాగ్ వందన సమర్పణ చేశారు.