ఉత్తర కొరియాలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

ఉత్తర కొరియాలో కరోనా విజృంభిస్తోంది. గత వారమే ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే అక్కడ దాదాపు 10 లక్షల మంది వరకు కరోనా బారినపడ్డారు. 
 
అయితే అక్కడ భారీగా కరోనా పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో కేవలం లక్షణాల ఆధారంగానే కరోనా వ్యాపి చెందిందని వైద్యులు అంచనా వేశారు. ప్రస్తుతం ఆ దేశంలో 10 లక్షల మందికి పైగా జ్వరంతో బాధపడుతున్నారని, ఇప్పటివరకు 50 మంది కరోనాకు బలయ్యారని అక్కడి ప్రభుత్వ మీడియానే వెల్లడించింది.

కాగా, గతేడాది ఉత్తరకొరియాలో వైరస్‌ వ్యాప్తి చెందినప్పుడు అమెరికా తయారు చేసిన ఆస్ట్రాజెనికా, చైనా తయారు చేసే టీకాలను సరఫరా చేస్తామని ఆఫర్‌ ఇచ్చినా కిమ్‌ ఆ ఆఫర్లను తిరస్కరించారు. అక్కడి ప్రజలకు టీకాలు వేయకుండా  కేవలం లాక్‌కౌడన్‌, సరిహద్దుల మూసివేతతోనే వైరస్‌ను అదుపు చేస్తామని తెలిపారు. 
 
అయితే ఇప్పుడు గతేడాది కన్నా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. అలాగే కిమ్‌ కరోనా పరిస్థితిపై ఇటీవల పొలిట్‌ బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు. 
 
ఈ సమావేశంలో ఔషధ సరఫరాలో అధికారులు విఫలమ్యారని ఆయన విమర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉత్తర కొరియా సైన్యంలో మెడికల్‌ కోర్‌ను రంగంలోకి దింపారు. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌ నగరానికి ఔషధ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.
 
కిమ్ మాస్క్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఎక్కడికక్కడ చెకింగ్ లు కొనసాగుతున్నాయి. కరోనా నుంచి కోలుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అక్కడి డాక్టర్లు జనానికి వివరిస్తున్నారు. ఉప్పు నీళ్లతో పుక్కిలించడం ద్వారా రిలీఫ్ అవ్వొచ్చని సూచిస్తున్నారు.
 
మరోవంక, ఉత్తర కొరియాలో కరోనా కేసుల ఉధృతి మరింతగా ఉండే అవకాశం  ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. కొరియాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదని, దీంతో కరోనా కేసులు పెరిగిపోయే ప్రమాదం ఉందని రీజినల్ డైరెక్టర్ పూనమ్ సింగ్ చెప్పారు. కరోనా నియంత్రణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. 
 
మరోవైపు ఉత్తర కొరియాలో కరోనా కల్లోలంపై అక్కడి అధికారుల నుంచి డబ్ల్యూహెచోకు  ఇప్పటి వరకు అధికారిక సమాచారం అందలేదని తెలిపారు. ఉత్తర కొరియాలో ఆరోగ్య వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.  చైనాలో కరోనా రాగానే సరిహద్దులను, వాణిజ్యాన్ని ఉత్తర కొరియా నిలిపేసింది.

దీంతో అక్కడ కేసులు రాలేవని చెప్పుకుంటూ వచ్చారు. మరోవంక క్షిపణిల ప్రయోగాలతో ఇక్యరాజ్యసమితి ఆ దేశంపై విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అటు సరిహద్దులు మూసేయడం, ఇటు ఆంక్షలతో ఉత్తర  కొరియా వాణిజ్యం పూర్తిస్థాయిలో దెబ్బతిన్నది. చివరిగా,  కరోనా తగ్గిందనుకున్న పరిస్థితిలో జనవరిలో చైనాతో వర్తక వాణిజ్యాలను రాకపోకలను తిరిగి మొదలు పెట్టింది. ఈ వ్యవధిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.