భారత్ – నేపాల్ సంబంధాలు తిరుగులేనివి 

హిమాలయాలవలే  భారత్, నేపాల్ సంబంధాలు తిరుగులేనివని, మహోన్నతమైనవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  ఒక రోజు నేపాల్ పర్యటన సందర్భంగా లుంబినీలో జరిగిన బుద్ధ జయంతి కార్యక్రమంలో పాల్గొంటూ  భారత్ – నేపాల్ ల మధ్య  ఎప్పటికీ బలపడుతున్న స్నేహం అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితులలో మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూరుస్తుందని కూడా భరోసా వ్యక్తం చేశారు.

ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బౌద్ధ సంస్కృతి,  వారసత్వానికి శంకుస్థాపన చేసిన తర్వాత ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా సోమవారం లుంబినీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ “మన  బహుముఖ భాగస్వామ్యంలో కొనసాగుతున్న సహకారాన్ని బలోపేతం చేయడానికి , కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఇది ఒక అవకాశం” అని పేర్కొన్నారు.


అమెరికా,  చైనా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, థాయ్‌లాండ్‌తో సహా అనేక విదేశీ దేశాలు బౌద్ధ తత్వశాస్త్రాన్ని ప్రోత్సహించే సాధనంగా లుంబినీలో తమ కేంద్రాలను నిర్మించిన దశాబ్దాల తర్వాత భారత్  బౌద్ధ కేంద్రం నిర్మాణం చేపట్టింది. దీనికి 100 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు పడుతుందని అంచనా.

నేపాల్‌లోని లుంబినీలో నేపాల్‌లో 490 మెగావాట్ల అరుణ్-4 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా సమక్షంలో సంతకాలు చేసుకున్నారు. ఎస్ జె వి ఎన్ కంపెనీ  ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నంద్ లాల్ శర్మ మాట్లాడుతూ నేపాల్‌లో కంపెనీ నిర్మించనున్న మూడవ మెగా ప్రాజెక్ట్ ఇది అని తెలిపారు.  900 మెగావాట్ల అరుణ్-3 ప్రాజెక్ట్ నిర్మాణం పురోగతిలో ఉంది, 669 మెగావాట్ల లోయర్ అరుణ్ ప్రాజెక్ట్ సర్వే దశలో ఉంది.

శర్మ, నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ కుల్మాన్ ఘిసింగ్ సంతకం చేసిన ఎంఓయుతో, ఈ కంపెనీ  నేపాల్‌లో మొత్తం 2,059 మెగావాట్ల సామర్థ్యంతో మూడు ప్రాజెక్టులను నిర్మిస్తుంది. ఎస్ జె వి ఎన్  2030 నాటికి నేపాల్‌లో 5,000 మెగావాట్ల ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని శర్మ తెలిపారు.

అంతకు ముందు,  బుద్ధ పౌర్ణమి పర్వదినం సందర్భంగా నేపాల్ లోని చారిత్రక మాయాదేవి  ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య డాక్టర్ అర్జు రాణా దేవుబా పాల్గొన్నారు. ఆలయం పక్కనే ఉన్న అశోక స్తంభం వద్ద ఇరువురు ప్రధానులు దీపాలు వెలిగించారు. అనంతరం బోధి వృక్షానికి నీళ్లు పోశారు.

బౌద్ధ సంస్కృతి, వార‌సత్వ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అనంతరం టెంపుల్ కాంప్లెక్స్‌లోని విజిటర్స్ బుక్‌లో మోదీ సంతకం చేశారు. గౌతమ బుద్ధుని జన్మస్థలమైన లుంబినిలోని ప్రఖ్యాత మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మోదీ నేపాల్ పర్యటన ప్రారంభమైనట్టు పీఎంఓ కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది.

నేపాల్‌లో అడుగుపెట్టగానే మోదీ ఓ ట్వీట్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బుద్ధ పౌర్ణమి పర్వదినాన నేపాల్ ప్రజలతో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉందని, లుంబినిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నానని తెలిపారు.