జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం!…. ఆ ప్రదేశం సీల్ చేయమన్న కోర్టు!

వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం- జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు మూడు  రోజులుగా జరుగుతున్న వీడియోగ్రఫీ సర్వే సోమవారం ఉదయం ఓ శివలింగంను కనుగొనడంతో ముగిసింది.  కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన సర్వే అనంతరం, హిందూవుల తరపు న్యాయవాదులు బావిలో ‘శివలింగం’ కనుగొన్నట్లు వెల్లడించారు. 

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మూడోరోజు మసీదు సముదాయం సర్వే సుమారు 10:15 గంటలకు ముగిసింది. వీడియో గ్రాఫిక్ సర్వే సోమవారం ముగిసిన కొన్ని గంటల తర్వాత, వారణాసి కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ‘శివలింగం’ కనుగొన్న ప్రదేశాన్ని వెంటనే సీలు చేయాలని ఆదేశించింది. సీల్ చేసిన ప్రదేశంలోకి ఎవరైనా ప్రవేశించడాన్ని కూడా కోర్టు నిషేధించింది.

సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవికుమార్ దివాకర్ ఈ ఆదేశం ఇచ్చారు. శివలింగం ఆవిష్కరణ ముఖ్యమైన సాక్ష్యం అని కోర్టు తన ఆదేశంలో పేర్కొంది.  కాంప్లెక్స్‌కు కాపలాగా ఉండాలని,  ముస్లింలు ప్రవేశించకుండా నిరోధించాలని సిఆర్పిఎఫ్  కమాండెంట్‌ని ఆదేశించింది.  స్థల భద్రతకు జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు కమిషనర్ సహకరించాలని కోర్టు ఆదేశించింది. 

ఆవరణలో శివలింగం కనిపించిన తర్వాత న్యాయవాది హరి శంకర్ జైన్ ప్రాంగణానికి భద్రత కల్పించాలని అభ్యర్థన చేశారు. హిందూ పక్షాన వాదిస్తున్న మరో న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ, శివలింగం 12 అడుగుల 8 అంగుళాల వ్యాసం కలిగి ఉందని, సంప్రదాయం ప్రకారం నందిని ఎదుర్కొంటున్న దిశలో ఉందని తెలిపారు.

సోమవారం నంది ఎదురుగా ఉన్న నిర్మాణాలను బృందం అంచనా వేసింది. ఇంతలో, హిందూవుల తరపు న్యాయవాది విష్ణు జైన్, వుజు సైట్ సమీపంలోని జ్ఞానవాపి ప్రాంగణంలో శివలింగం కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమ గోడ, నమాజ్ స్థలం, వుజు స్థలం, నేలమాళిగలో సర్వే నిర్వహించారు. 

దాదాపు 1,500 మంది భద్రతా సిబ్బంది రక్షణలో ఉండగానే ప్రతినిధి బృందం సర్వే నిర్వహించింది. సర్వే నేపథ్యంలో సోమవారం నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గోదోలియా నుంచి మైదాగిన్ వరకు అన్ని దుకాణాలు మూతపడ్డాయి.  కోర్టు నియమించిన అడ్వకేట్ కమీషనర్లు, ఇరుపక్షాల న్యాయవాదులు, అన్ని సంబంధిత పక్షాలు, అధికారుల సమక్షంలో మూడు రోజుల తనిఖీ తర్వాత ప్రాంగణంలో సర్వే మధ్యాహ్నం సమయంలో ముగిసింది. 

కోర్టు నియమించిన కమిషన్ చర్య సోమవారంతో పూర్తయిందని వారణాసి పోలీసు కమిషనర్ సతీష్ గణేష్ మీడియాకు తెలిపారు. “మూడు రోజుల చర్య సోమవారం ముగిసింది. ప్రశాంత వాతావరణంలో ఇది జరిగింది. సహకరించిన కాశీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని తెలిపారు.

అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా “పక్షపాతంతో” వ్యవహరిస్తున్నారని మసీదువైపు న్యాయవాదులు  ఆరోపించిన తరువాత, న్యాయస్థానం గురువారం ఇద్దరు అదనపు అడ్వకేట్ కమిషనర్లను- అడ్వకేట్ విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ సింగ్లను నియమించింది. 

సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవికుమార్ దివాకర్ గురువారం మాట్లాడుతూ, కోర్టు నియమించిన కమిషన్ సర్వేను పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని, “సంబంధిత చర్యలను” పర్యవేక్షించాలని డిజిపి, చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు.

ఏప్రిల్ 8న, పిటిషనర్లను విచారిస్తున్నప్పుడు, వారణాసి కోర్టు వివాదాస్పద స్థలంలో మా శృంగార్ గౌరీ స్థలానికి సంబంధించిన సర్వేను నిర్వహించడానికి మిశ్రాను నియమించింది.  “చర్యకు సంబంధించిన వీడియోగ్రఫీని సిద్ధం చేసి” నివేదికను సమర్పించాలని  మిశ్రాకు సూచించింది.