అత్యాచారం కేసులో రాజస్థాన్ మంత్రి తనయుడు

23 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు రాజస్తాన్‌ మంత్రి మహేష్‌ జోషి కుమారుడు రోహిత్‌జోషిపై కేసు నమోదైంది. రోహిత్‌ను అరెస్ట్‌ చేసేందుకు 15 మంది అధికారులతో కూడిన ఢిల్లీ పోలీసుల బృందం రాజస్తాన్‌కు చేరుకుంది. 
 
మంత్రికి చెందిన రెండు నివాసాల్లోనూ సోదాలు చేపట్టామని తెలిపారు. రోహిత్‌ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. మే 18లోగా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశామని, సమన్ల కాపీని మంత్రి ఇంటి గోడపై అతికించినట్లు వెల్లడించారు.

ఈ ఏడాది జనవరి 8 నుండి ఏప్రిల్‌ 17 మధ్య పలుసార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. గతేడాది ఫేస్‌బుక్‌లో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలిపింది. తనను కిడ్నాప్‌ చేయడంతోపాటు బ్లాక్‌ మెయిలింగ్‌కు కూడా పాల్పడ్డాడని వివరించింది. 
 
తాను గర్భవతిననే విషయం ఆగస్టు 2021లో తెలిసిందని, గర్భస్రావం మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేశాడని, కానీ తాను తీసుకోలేదని వివరించింది. ఆమె ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, అనంతరం ఎఫ్‌ఐఆర్‌గా మార్చామని పేర్కొన్నారు. కాగా, తాను సత్యం, న్యాయం కోసం నిలబడతానని, చట్టాన్ని గౌరవిస్తానని మంత్రి  మహేష్ జోషి పేర్కొన్నారు.