జమైకాలో పర్యటిస్తున్న మొదటి భారత రాష్ట్రపతి కోవింద్

నాలుగు రోజుల పర్యటనకై జమైకా చేరుకున్న భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు  రాజధాని నగరంలోని   కింగ్‌స్టన్   విమానాశ్రయంలో  ఆయనకు ఆ దేశ అధినేతలతో పాటు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. జమైకాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కావడం విశేషం. 

ఆయనతో పాటు ఆయన భార్య సవితా కోవింద్, కూతురు స్వాతి కోవింద్, కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి, లోక్‌సభ ఎంపీలు రమా దేవి, సతీష్ కుమార్ గౌతమ్‌లతో పాటు సెక్రెటరీ స్థాయి అధికారులు కొందరు వెళ్లారు. జమైకా గవర్నర్ జనరల్ పాట్రిక్ అల్లెన్,   ప్రధాని ఆండ్రూ హోల్ నెస్,   కేబినెట్ సభ్యులు, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్, పోలీస్ కమిషనర్ స్వయంగా కింగ్‌స్టన్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి కోవింద్‌కు స్వాగతం పలికారు.

జమైకా సైనికులు కోవింద్‌కు గౌరవ వందనం చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆయన పెగాసస్‌ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు కోవింద్‌కు స్వాగతం పలికారు. నాలుగు రోజుల షెడ్యూల్‌లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో కోవింద్ పాల్గొననున్నారు.

సోమవారం రాత్రి ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసే సంగీత కచేరీలో కోవింద్ పాల్గొననున్నారు. మంగళవారం బాబాసాహేబ్ అంబేద్కర్ పేరుతో నిర్మించిన `అంబెదర్ అవెన్యూ’ రోడ్డును కోవింద్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జమైకా- భారత్  స్నేహానికి గుర్తుగా నిర్మించిన గార్డెన్‌ను ప్రారంభిస్తారు.  జమైకాలోని క్రికెట్ ఆశావాహులకు క్రికెట్ కిట్లు అందించనున్నారు. బుధ, గురువారాల్లో మరిన్ని కార్యక్రమాల్లో కోవింద్ పాల్గొని భారత్‌కు తిరిగి రానున్నారు.