వలసదారుడిని బిషప్‌గా నియమించిన పాప్

వలసదారుడిని బిషప్‌గా నియమించిన పాప్
 
కాథలిక్ చర్చి చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచే నిర్ణయాన్ని పోప్ లియో XIV ప్రకటించారు.  ఒకప్పుడు కారు డిక్కీలో దాక్కుని, ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించిన  ఎల్ సాల్వడార్ దేశస్థుడైన  ఎవెలియో మెన్జివర్ అయాలా (55)ను   పోప్ లియో XIV పశ్చిమ వర్జీనియాకు కొత్త బిషప్‌గా నియమించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కఠిన చర్యలను ముమ్మరం చేస్తున్న తరుణంలో పోప్ ఈ చారిత్రాత్మక ప్రకటన చేశారు. 
వెస్ట్ వర్జీనియాలోని వీలింగ్-చార్లెస్టన్ బిషప్ మార్క్ ఇ. బ్రెన్నన్ రాజీనామాను పోప్ ఆమోదించి, ఆయన స్థానంలో వాషింగ్టన్‌కు చెందిన 55 ఏళ్ల బిషప్ ఎవెలియో మెన్జివర్-అయాలాను ఎంపిక చేశారు.  బిషప్ మెన్జివర్-అయాలా 1990లో అమెరికాకు వలస వచ్చారు. 2023లో, ఆయన వాషింగ్టన్ ఆర్చ్‌డయోసిస్‌లో సహాయక బిషప్‌గా పనిచేస్తూ, దేశంలో మొదటి సాల్వడోరియన్ బిషప్‌గా అయ్యారు.
మధ్య అమెరికాలో జన్మించిన మొదటి అమెరికా బిషప్‌లలో ఒకరిగా పరిగణించబడే ఆయన, వలసదారుల పట్ల డొనాల్డ్ ట్రంప్ దూకుడు విధానాలను వ్యతిరేకించాలని కాథలిక్కులను బహిరంగంగా కోరారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో, తాను తన కొత్త బాధ్యతను “అత్యంత సంతోషంతో,  వినయంతో” స్వీకరించినట్లు మెంజివర్-అయాలా తెలిపారు.  
యువత ఆలోచనలను వినడం, పేదలు, కార్మికులు, వలసదారుల సమస్యలను ఆలకించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎల్ సాల్వడార్‌లోని చలటెనాంగోలో 1970 ఆగస్టు 14న జన్మించిన మెన్జివర్-అయాలా జీవితం పోరాటాలతో నిండింది.   సాల్వడోరన్ అంతర్యుద్ధ హింసాకాండ సమయంలో కుటుంబంతో కలిసి హింస నుండి తప్పించుకుని, మూడవ ప్రయత్నంలో అమెరికాకు చేరుకున్నారు. అక్కడ స్వీపర్‌గా, నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ తన జీవితాన్ని నిర్మించుకున్నారు.  
అమెరికాకు తాను చేసిన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన ఇలా వివరించారు: “నేను కేవలం ఒక జత దుస్తులు మాత్రమే ఉన్న ఒక బ్యాక్‌ప్యాక్‌ను వెంట తెచ్చుకున్నాను. కానీ అది కలలతో, కొన్నిసార్లు మనకు అర్థం కాని భ్రమలతో నిండి ఉంది. ఆ కల అనేది మనల్ని నడిపించే ఒక వెలుగు. ఆ ప్రణాళిక మనకు అర్థం కాకపోయినప్పటికీ, మనం దేవునిపై నమ్మకంతో ధైర్యంగా ముందడుగు వేస్తాము.”