అమెరికా వైమానిక దళం ‘క్లౌడ్ వన్‌’లో హ్యాకర్ల పాగా

అమెరికా వైమానిక దళం అత్యంత కీలకంగా భావించే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ ‘క్లౌడ్ వన్‌’ ను హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. సైనిక కార్యకలాపాలు, వ్యూహాత్మక సమాచారం, సిబ్బంది వివరాలు, ఆయుధ నిల్వలు, విమానాల నిర్వహణకు సంబంధించిన కీలక సమాచారాన్ని నిర్వహించే ఈ వ్యవస్థలోకి చొరబడటం అమెరికా రక్షణ రంగంలో ఆందోళన కలిగిస్తోంది.  
 
క్లౌడ్ వన్‌పై దాడి ఘటన అమెరికా ప్రభుత్వ వ్యవస్థల్లో వరుసగా వెలుగుచూస్తున్న సైబర్ భద్రతా సమస్యల మధ్య చోటుచేసుకుంది. ఇటీవల ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, ట్రెజరీ శాఖతో పాటు నిఘా సంస్థలకు సంబంధించిన వ్యవస్థల్లోనూ సైబర్ చొరబాట్లు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. క్లౌడ్ వన్ అనేది అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత కీలకమైన క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ. 2017లో దీనిని ప్రారంభించారు. 

సైనిక విభాగాలకు అవసరమైన సమాచారాన్ని వేగంగా అందించడం, వివిధ ప్రాంతాల్లోని విభాగాల మధ్య డేటా మార్పిడిని సులభతరం చేయడం, కార్యకలాపాలను సమన్వయం చేయడం వంటి కీలక బాధ్యతలను ఈ వ్యవస్థ నిర్వహిస్తుంది. అమెరికా సైన్యంలోని అతిపెద్ద క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

క్లౌడ్ వన్ కేవలం సాధారణ కంప్యూటింగ్ వ్యవస్థ మాత్రమే కాదు. అమెరికా వైమానిక దళానికి సంబంధించిన అనేక కీలక కార్యకలాపాలకు ఇది సాంకేతిక ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా రెండు అప్లికేషన్లు అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. 

క్లౌడ్ బేస్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ఉత్తర అమెరికా ప్రాంతంలోని వాయు రక్షణ రాడార్, ఇతర సమాచారాన్ని సమీకరిస్తుంది. అలాగే థియేటర్ ఇంటిగ్రేటెడ్ కంబాట్ మ్యూనిషన్స్ సిస్టమ్ (టిఐసిఎంఎస్) ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా అమెరికా వైమానిక దళ ప్రాంతాల్లోని బాంబులు, క్షిపణుల నిల్వలను ట్రాక్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్‌లోని ఒక లోపాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు వ్యవస్థలోకి ప్రవేశించినట్లు ఒక మూలం తెలిపింది. అయితే ఏ సాఫ్ట్‌వేర్‌లో లోపం ఉంది? దాన్ని ఎలా ఉపయోగించుకున్నారు? అనే విషయాలను అధికారులు వెల్లడించలేదు. ఈ చొరబాటు బయటపడిన తర్వాత భద్రతా చర్యల్లో భాగంగా కొన్ని కీలక కార్యకలాపాలను నిలిపివేశారు. 

క్లౌడ్ వన్‌లో ఇప్పటికే పనిచేస్తున్న అప్లికేషన్లకు అప్‌డేట్లు ఇవ్వడాన్ని అడ్డుకున్నారు. కొన్ని అప్లికేషన్లను కొత్త క్లౌడ్ వ్యవస్థకు తరలించే ప్రక్రియను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాకుండా కొంతమంది వినియోగదారుల అడ్మినిస్ట్రేటర్ అధికారాలను తొలగించినట్లు సమాచారం. దీంతో సాధారణ నిర్వహణ పనులు, సాఫ్ట్‌వేర్ లోపాల సవరణలు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.

About The Author