శ్రీలంక కొత్త ప్రధానితో భారత హై కమిషనర్‌ భేటీ

శ్రీలంక కొత్త ప్రధాని రణిల్‌ విక్రమసింఘెతో శుక్రవారం భారత హై కమిషనర్‌ గోపాల్‌ బాగ్లే భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో అతలాకుతలమవుతున్న దేశంలో సుస్థిరత నెలకొల్పేందుకు గురువారం ప్రధానిగా విక్రమసింఘె ప్రమాణస్వీకారం చేశారు.
 
 శుక్రవారం బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటిసారిగా బాగ్లే కలిశారని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. అనూహ్యమైన రీతిలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్‌ ఇంధనం, ఇతర నిత్యావసరాల కొనుగోలుకు అవసరమైన సాయం అందించింది. జనవరి నుండి ఇప్పటివరకు 300కోట్ల డాలర్లను సాయంగా ఇచ్చింది. 
 
కాగా, భారత్‌తో మరింత సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకునే దిశగా చర్యలు తీసుకుంటామని అంతకు ముందు రణిల్‌ విక్రమసింఘె తెలిపారు. భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.
స్వాతంత్య్రం అనంతరం ఇటీవల శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశానికి ఆర్థిక సహాయం అందించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు వివిధ రూపాల్లో భారత్‌ 3 బిలియన్ల డాలర్లను అందించేందుకు ముందుకు వచ్చింది.