ఓ యువతి సమాధానంతో ప్రధాని భావోద్వేగం.. కంటతడి

గుజరాత్ లోని భరుచ్ నగరంలో నిర్వహించిన `ఉత్కర్ష సమారోహ్’  కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ యువతీ ఇచ్చిన సమాధానంకు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంట తడి పెట్టుకున్నారు. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేక పోయారు. 
 
ఈ సందర్భంగా లబ్ధిదారుడు, దృష్టిలోపం గల ఓ వ్యక్తి కుమార్తెతో మాట్లాడుతూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. బాలిక చెప్పిన సమాధానానికి ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకున్నారు. మీ కుమార్తెలను ఉన్నత చదువులు చదివిస్తారా? అని ఆ దివ్యాంగుడైన యాకూబ్ పటేల్ అనే వ్యక్తిని ప్రధాని అడిగితే… తన ముగ్గురు కుమార్తెల్లో ఒకరు డాక్టర్ కావాలనుకుంటోందని ఆయన చెప్పారు.

దీంతో వైద్య విద్యనే ఎందుకు ఎంచుకున్నావని ఆ దివ్యాంగుడి కుమార్తెను మోదీ ప్రశ్నించగా… ‘‘నా తండ్రి పడుతున్న బాధను చూసి నేను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా’’ అని యువతి సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానం విన్న మోదీకి నోటి మాట రాలేదు. కొన్ని క్షణాల పాట మౌనంగా ఉండిపోయిన ప్రధాని.. కన్నీటిని ఆపుకున్నారు. 

 
కాసేపటికి తేరుకుని నీ ప్రేమే నీ బలం అంటూ యువతిని మెచ్చుకున్నారు. మీ కుమార్తెల కలను నెరవేర్చడానికి ఏదైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి అని యాకూబ్‌ పటేల్‌కు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
వితంతువులు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆర్థిక సాయం అందించే నాలుగు ప్రభుత్వ పథకాలు 100 శాతం లబ్ధిదారులకు అందుతున్న క్రమంలో.. ‘ఉత్కర్ష్ సమారోహ్’ కార్యక్రమాన్ని భరుచ్ జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు 100 శాతం ప్రజలకు చేరువకావడం వల్ల వివక్షకు తెరపడిందని చెప్పారు.
 
“ఇప్పుడు వాటి ప్రయోజనాలు పొందడానికి సిఫార్సులు వసరం. అలాగే.. బుజ్జగింపు రాజకీయలకు సైతం ముగింపు పలికినట్టయ్యింది. ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే అవి కాగితాలకే పరిమితం కావడం లేదా అనర్హులు ప్రయోజనాలు పొందటం వంటివి జరుగుతున్నాయి’’ అని మోదీ పేర్కొన్నారు.
 
 గుజరాత్  అధికారులు ఉత్కర్ష్ సమారోహ్ పేరుతో జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఇందులో భాగంగా గుజరాత్‌ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాల్టీ వార్డుల్లో శిబిరాలను నిర్వహించి, లబ్దిదారులను గుర్తించేందుకు అవసరమైన పత్రాలను స్వీకరించారు. భరూచ్‌లో ఈ నాలుగు పథకాలు కింద 12,854 మంది లబ్దిదారులను గుర్తించారు.