రూ.28 వేల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదే!

ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ.28 వేల కోట్లు ఖర్చు పెట్టామంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘28 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని చెప్పినవ్ కదా…  ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష్మీదేవి పల్లి, పాలమూరు-రంగారెడ్డి, ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను ఎందుకు పూర్తి చేయలేదు?’’అని ప్రశ్నించారు. 
 
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో 27వ రోజు పాదయాత్ర సందర్భంగా మంగళవారం రాత్రి కేశంపేట మండల కేంద్రంలో స్వాగతం పలికిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ  ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల కమీషన్లు దండుకోవడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
 రియల్ ఎస్టేట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు వెంచర్ల దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.  వీధి దీపాల కోసం కేంద్రం గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తే… రాష్ట్ర వ్యాప్తంగా తనకు నచ్చిన ఒక సంస్థకే వీధి దీపాల మెయింటెనెన్స్ అప్పగించాలంటూ కేసీఆర్ ఫ్రభుత్వం దుర్మార్గపు జీవో చేసిందని విమర్శించారు.
దళిత బిడ్డ నాగరాజును నడిరోడ్డుపై ముస్లిం వ్యక్తులు హత్య చేస్తే స్పందించని దుస్థితిలో ఎందుకు ఉన్నామో ఆలోచించాలని సంజయ్ కోరారు. ఎంఐఎం చేతిలో బందీగా కేసీఆర్ మారారని చెబుతూ హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
త్వరలోనే పాతబస్తీని కైవసం చేసుకుని కొత్త బస్తీగా తీర్చిదిద్దుతామని,  గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించి తీరుతామని వెల్లడించారు.  లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను పూర్తి చేయలేదని చెబుతూ కేసీఆర్ కుర్చీ గురించే ఆలోచిస్తాడు తప్ప, ఇక్కడి ప్రజల గురించి ఆలోచించడని విమర్శించారు.
 
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 200 కి.మీల దూరం నుండి ఫాంహౌజ్ కు నీళ్లు తెచ్చుకునేందుకు రూ.1.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమయ్యే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను ఎందుకు పూర్తి చేయలేదు? అని సంజయ్ ప్రశ్నించారు.  ప్రధాని మోదీ  తెలంగాణ కు లక్షా 40వేల ఇండ్లు ఇస్తే కేశంపేట్ లో కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చాడో చెప్పాలని నిలదీశారు.  కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు.
 
అందరినీ కేసీఆర్ మోసం చేస్తున్నారని అంటూరాష్ట్రంలో గడీల రాజ్యం నడుస్తోందని, పేడోళ్ల బలిదానం తో ఏర్పడిన తెలంగాణ లో పెద్దోడు రాజ్యమేలుతున్నాడని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.  కేశంపేట్ అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల  చేయమని సవాల్ చేశారు.
 
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయని చెబుతూ కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. అది వెళ్ళేది టీఆర్ఎస్ కే అని సంజయ్ హెచ్చరించారు.